TS News: కాసోజు శంకరమ్మకు ఎమ్మెల్సీ!

ABN , First Publish Date - 2023-06-21T21:56:42+05:30 IST

తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది.

TS News: కాసోజు శంకరమ్మకు ఎమ్మెల్సీ!

నల్లగొండ: తెలంగాణ మలిదశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. హైదరాబాద్‌లో ఈ నెల 22న నిర్వహించనున్న అమరవీరుల స్మృతి వనం ఆవిష్కరణలో పాల్గొనాలని కోరింది. అధిష్ఠానం నుంచి పిలుపు రావడం, గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండడంతో శంకరమ్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జోరందుకుంది. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌కు డ్యామేజీ చేసే అంశం కావడంతో సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా శంకరమ్మను పిలిపించినట్లు సమాచారం. శంకరమ్మను హైదరాబాద్‌కు తీసుకువచ్చే బాధ్యతను సీఎం కేసీఆర్‌ మంత్రి జగదీష్‌రెడ్డికి అప్పగించారు.

2014 ఎన్నికల్లో శంకరమ్మ హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో శంకరమ్మను పక్కకు పెట్టి సైదిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. దీంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను పలుమార్లు కోరింది. వివిధ వేదికలపై తనతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని శంకరమ్మ బహిరంగ ప్రకటనలు చేస్తుండడం బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారడంతో తాజాగా పిలుపు అందిందన్న ప్రచారం జరుగుతోంది. శంకరమ్మకు బుధవారమే గన్‌మన్‌, పీఏ, ప్రభుత్వ వాహనాన్ని కేటాయించడంతో ఎమ్మెల్సీ పదవి ప్రచారానికి బలం చేకూరుతోంది.

Updated Date - 2023-06-21T21:56:42+05:30 IST