Share News

Lasyanandita: గడ్డు పరిస్థితులను అధిగమించి.. మొదటిసారి అసెంబ్లీలోకి...

ABN , First Publish Date - 2023-12-08T09:46:22+05:30 IST

సాయన్న కుమార్తెగా లాస్యనందిత(Lasyanandita) గతంలో కంటోన్మెంట్‌ పాలకమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో నేర్చుకున్న

Lasyanandita: గడ్డు పరిస్థితులను అధిగమించి.. మొదటిసారి అసెంబ్లీలోకి...

తండ్రి మరణంతో అనూహ్యంగా టికెట్‌ దక్కించుకున్న ఆమెపై సానుభూతి కన్నా.. ఎక్కువగా వ్యతిరేక ప్రచారం చేశారు. తండ్రి చాటు బిడ్డగా కొట్టిపారేశారు. కానీ, అన్ని ప్రతికూలతలను కాదని.. దివంగత సాయన్న పేరు నిలబెడుతూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్యనందిత.

సికింద్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి): సాయన్న కుమార్తెగా లాస్యనందిత(Lasyanandita) గతంలో కంటోన్మెంట్‌ పాలకమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో నేర్చుకున్న పాఠాల నుంచి కవాడిగూడ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. ఐదేళ్ల తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అదే డివిజన్‌ నుంచి పరాజయం పాలయ్యారు. అయినా కుంగిపోలేదు. కంటోన్మెంట్‌(Cantonment) శాసనసభ్యుడిగా ఉన్న తండ్రి సాయన్న అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన వెన్నంటి ఉంటూ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు పెంచుకున్నారు. సాయన్న హఠాన్మరణంతో టికెట్‌ కోసం బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో ముమ్మర పోటీ ఏర్పడింది. సాయన్న వారసురాలిగా లాస్యనందితకు టికెట్‌ గగనమని, ఇక రాజకీయాలకు సాయన్న కుటుంబం దూరమేనంటూ ఓ దశలో ప్రచారం జరిగింది. అయితే.. కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం సాయన్న కుటుంబానికి న్యాయం చేస్తూ, లాస్యనందితకు టికెట్‌ కేటాయించింది. దాంతో సాయన్న కుటుంబ సభ్యులతోపాటు ఆయన అనుచరగణం సంబరపడిపోయింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఆమె విజయానికి సమన్వయంతో కృషి చేయాల్సిన పార్టీ నాయకుల్లో పలువురు ఆర్థిక వనరులను సాకుగా చూపి పలుమార్లు సహాయ నిరాకరణ చేశారు.

రెండు, మూడుసార్లు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిలిపేశారు. దాంతో లాస్యనందిత, కుటుంబ సభ్యులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో కేసీఆర్‌, కేటీఆర్‌ల నాయకత్వంతోపాటు సాయన్న చరిష్మా తమను విజయ తీరాలకు చేరుస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. టికెట్‌ విషయంలో తమకు అండగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను నిరంతరం కలుస్తూ, పరిస్థితులు వివరిస్తూ వచ్చారు. దాంతో తలసాని జోక్యం చేసుకున్నారు. తాను సనత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటికీ, కంటోన్మెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా రంగప్రవేశం చేశారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, లాస్యనందిత విజయానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలి మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డికి పెత్తనం అప్పగించారు. అంతటితో ఆగకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సాయన్న కుటుంబానికి సన్నిహితుడైన ఎంఎన్‌.శ్రీనివా్‌సను రంగంలోకి దించారు. కంటోన్మెంట్‌ బీఆర్‌ఎ్‌సను ఒక దారిలో పెట్టాలని, లాస్యనందిత గెలుపు బాధ్యతలు అప్పగించారు. దాంతో పరిస్థితులు క్రమేణా చక్కబడుతూ వచ్చాయి. పార్టీ నాయకుల్లో సమన్వయం నెలకొంది. పోలింగ్‌కు ముందు రోజుల్లో లాస్యనందిత, ఇతర కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు సోషల్‌ మీడియా ద్వారా చేసిన వ్యతిరేక ప్రచారాన్ని వారు సంయమనంతో భరించారు. బీఆర్‌ఎస్‌ అండదండలు, కేసీఆర్‌, కేటీఆర్‌ల నాయకత్వం, సాయన్న చరిష్మా తమను గట్టెక్కిస్తాయని మరోసారి విశ్వసించారు. తుదకు ఎన్నికల్లో 17వేల పైచిలుకు మెజారిటీతో లాస్యనందిత విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో సాయన్న విజయం సాధించగా, మరణానంతరం తాజా ఎన్నికల్లో ఆయన వారసురాలిగా లాస్యనందిత గెలుపొంది, అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. తద్వారా సాయన్న కుటుంబం హ్యాట్రిక్‌ విజయం సాధించినట్లయింది.

Updated Date - 2023-12-08T09:46:23+05:30 IST