Preethi case: మెడికో ప్రీతి కేసులో వెలుగులోకి అసలు నిజాలు.. సైఫ్ ఏం చేశాడో బయటకొచ్చింది

ABN , First Publish Date - 2023-03-01T16:09:33+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి (Warangal preethi case) ఘటనలో సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి.

Preethi case: మెడికో ప్రీతి కేసులో వెలుగులోకి అసలు నిజాలు.. సైఫ్ ఏం చేశాడో బయటకొచ్చింది

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి (Warangal preethi case) ఘటనలో సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) చేతికి చిక్కిన ఈ రిపోర్ట్‌లో అసలు నిజాలు బయటపడ్డాయి. సైఫ్ ఫోన్‌ నుంచి 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్సప్ గ్రూప్ చాట్స్‌ను విశ్లేషించి ముఖ్యమైన విషయాలను గుర్తించారు. అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌గా ఉన్న సైఫ్... ప్రీతిని సూపర్వైజ్ చేశాడని, రెండు ఘటనల ఆధారంగా కోపం పెంచుకున్నాడని పేర్కొన్నారు.

డిసెంబర్‌లో ఒక యాక్సిడెట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాయగా.. దానిని వాట్సప్ గ్రూపులో పెట్టి సైఫ్ అవహేళన చేశాడు. ప్రీతికి రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ఆమెను అవమానపరిచాడు. దీంతో తనతో ఏమైనా ప్రాబ్లమా? అంటూ సైఫ్‌ను ప్రీతి ప్రశ్నించింది. ఏమైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలంటూ హెచ్చరించింది. దీంతో పగ పెంచుకున్న సైఫ్ తన స్నేహితుడు భార్గవ్‌కు ప్రీతిని వేధించాలని చెప్పినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇక ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ పురిగొల్పాడని పోలీసులు గుర్తించారు. కాగా ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన ప్రీతి గత నెల 21న హెచ్‌వోడీ నాగార్జునకి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌కు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

సుధీర్ఘంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం..

వరంగల్ మెడికో ప్రీతి ఘటనకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీ సుదీర్ఘ సమావేశం కొనసాగుతోంది. ఈ కమిటీ ముందు అనస్తీషియా హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి హాజరయ్యారు. ప్రీతి ఘటనలో నాగార్జున రెడ్డి నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీ వివరాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Updated Date - 2023-03-01T16:27:07+05:30 IST