KCR: భారత్ పేదదేశం కాదు.. అమెరికా కంటే ధనవంతమైనది: కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-02-05T15:52:01+05:30 IST

భారత్ పేదదేశం కాదు.. అమెరికా (America) కంటే ధనవంతమైన దేశమని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. భారత్ (Bharat) బుద్ధిజీవుల దేశమని కొనియాడారు.

KCR: భారత్ పేదదేశం కాదు.. అమెరికా కంటే ధనవంతమైనది: కేసీఆర్‌

నాందేడ్‌: భారత్ పేదదేశం కాదు.. అమెరికా (America) కంటే ధనవంతమైన దేశమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యాఖ్యానించారు. భారత్ (Bharat) బుద్ధిజీవుల దేశమని నాందేడ్‌లో తలపెట్టిన బీఆర్‌ఎస్ (BRS) బహిరంగ సభలో అన్నారు. నాగలి పట్టే చేతులు.. శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదు.. ప్రజలు, రైతులు (Farmers) గెలవాలని ఆకాంక్షించారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని, దేశంలో ఉన్నంత సాగుయోగ్యమైన భూమి మరెక్కడా లేదని అన్నారు. కానీ ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అనేక నదులు ఉన్నా నీటి కరువు ఎందుకని ప్రశ్నించారు. దేశ పరిస్థితులను చూశాక టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చామని కేసీఆర్‌ ప్రస్తావించారు.

‘‘దేశంలో సమూల మార్పులు తేవాలని నిర్ణయించాం. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎన్నో కూటములు పాలన చేశాయి.. మనదేశం ఇంకా ఆశించిన అభివృద్ధి సాధించలేదు. దేశంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దేశ నాయకత్వంలో మార్పు వస్తేనే ప్రగతి సాధ్యం. దేశానికి కనీస తాగునీరు, కరెంట్ ఇవ్వడం లేదు. మహారాష్ట్ర (Maharashtra)లో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అందుకే 'అబ్‌కీ బార్.. కిసాన్‌ సర్కార్' నినాదంతో వచ్చాం’’ కేసీఆర్‌ తెలిపారు.

బీఆర్‌ఎస్‌ సభకు భారీగా ప్రజలు

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా.. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌ను విస్తరించే దిశగా పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌ (Nanded)లో నేడు బహిరంగ సభ నిర్వహించారు. నాందేడ్‌ పట్టణంతో పాటు.. సభాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్దఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. జిల్లాలోని నాందేడ్‌ సౌత్‌, నార్త్‌, బోకర్‌, నాయిగాం, ముఖేడ్‌, డెగ్లూర్‌, లోహ నియోజకవర్గాలు, కిన్వట్‌, ధర్మాబాద్‌ పట్టణాలు, ముద్కేడ్‌, బిలోలి, ఉమ్రి, హిమాయత్‌ నగర్‌, తదితర మండలాలలోని అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2023-02-05T16:29:25+05:30 IST