TG : గవర్నర్ వర్సెస్ కేసీఆర్ ఎపిసోడ్‌లోకి షర్మిల ఎంట్రీ.. ఆసక్తికర ట్వీట్స్..!

ABN , First Publish Date - 2023-01-25T22:33:12+05:30 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan).. సీఎం కేసీఆర్ (CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి.

TG : గవర్నర్ వర్సెస్ కేసీఆర్ ఎపిసోడ్‌లోకి షర్మిల ఎంట్రీ.. ఆసక్తికర ట్వీట్స్..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan).. సీఎం కేసీఆర్ (CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలకు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి. ప్రోటోకాల్ వ్యవహారం వచ్చినప్పుడల్లా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా పరిస్థితులు మారిపోతున్నాయ్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయినా గవర్నర్, కేసీఆర్ కలిసే పాల్గొంటారని అందరూ భావించారు కానీ.. అది కూడా జరగట్లేదు. అంతేకాదు ఆఖరికి రాజ్‌భవన్‌‌లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి డుమ్మా కొట్టే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లోకి YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఎంటరయ్యారు. ట్విట్టర్ వేదికగా షర్మిల చేసిన ట్వీట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గట్టిగానే షాకిచ్చిందిగా..!

రిపబ్లిక్ డే వేడుకలపై వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లేసరికి.. కేసీఆర్ సర్కార్‌కు గట్టిగానే షాకిచ్చింది. గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిందేనంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) ఇచ్చింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌ (Raj Bhavan)కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ (Guidelines) పాటిస్తారా? లేదా? చెప్పాలని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. గణతంత్ర వేడుకలకు కోవిడ్ (Covid) కారణం చూపడం సరికాదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తప్పకుండా పరేడ్‌ గ్రౌండ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని, పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో సైతం గణతంత్ర వేడుకలు జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది.

ఏం నిర్ణయిస్తారో..!

హైకోర్టు తీర్పుపై టీఆర్ఎస్ నుంచి మంత్రులు, కీలక నేతలు స్పందించారు కానీ.. వేడుకలు, ఎట్ హోమ్‌పై ఒక్కరూ క్లారిటీ ఇవ్వలేదు. హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని చెప్పారంతే. మరోవైపు ఇందుకు కౌంటర్‌గా బీజేపీ నేతలు కూడా మాట్లాడారు. మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్ సర్కారును ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్కు ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని, రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇన్ని విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఊహకందట్లేదు.

వైఎస్ షర్మిల ఎంట్రీ..!

రిపబ్లిక్ వేడుకలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఈ ఎపిసోడ్‌లోకి YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై ఆసక్తికర ట్వీట్స్ చేశారు. ‘దొర గారి బహిరంగ సభలకు అడ్డురాని కరోనా.. గణతంత్ర వేడుకలకు అడ్డొచిందట. అందుకే వేడుకలు నిర్వహించడం లేదట. అసలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక తాలిబన్ రాజ్యానికి అధిపతా? ఇదేనా భారత రాజ్యాంగంపై కేసీఆర్ కు ఉన్న గౌరవం? గవర్నర్ గారికి మీకు పడకుంటే వేడుకలు ఆపేస్తారా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. అంతటితో ఆగలేదు.. ‘అవునులే.. రాజ్యాంగాన్ని మార్చేయాలని చెప్పిన నాడే మీరు దేశ ద్రోహులని అర్థమైంది. తాజాగా ఇప్పుడు రుజువైంది. గౌరవ హైకోర్టు ఆదేశాలు కూడా మీకు లెక్కలేవంటే... ఇక్కడ అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు... కల్వకుంట్ల రాజ్యాంగమే’ అంటూ మరో ట్వీట్ చేశారు షర్మిల.

అప్పట్లో ఇలా..!

గవర్నర్‌తో షర్మిలకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. నర్సంపేట ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో చోటుచేసుకున్న పరిణామాలపై రాజ్‌భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ సర్కార్‌పై ఫిర్యాదులు చేశారు షర్మిల. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల కోరగా.. గవర్నర్ కూడా సానుకూలంగానే స్పందించారు కూడా. అప్పట్లో ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి షర్మిలతో మాట్లాడారనే టాక్ కూడా నడిచింది. ఇక్కడ గవర్నర్‌తో.. అటు మోదీతో షర్మిల మంచిగా ఉంటూనే కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేయడమేంటనే విమర్శలు కూడా వస్తున్నాయి.

మొత్తానికి చూస్తే.. గవర్నర్- కేసీఆర్ మధ్య నెలకొన్న ప్రతి వివాదంలోనూ షర్మిల ఎంటరైపోయి విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. షర్మిల కామెంట్స్‌ను బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారనేది వేచి చూడాలి మరి.

Updated Date - 2023-01-25T22:33:15+05:30 IST