Hyderabad: హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారా..? ఇది ఎంత గుడ్‌ న్యూస్ అంటే..

ABN , First Publish Date - 2023-05-26T15:43:00+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా జనరల్‌ రూట్‌ పాస్‌కు (Route Pass) టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ప్రవేశపెట్టిన ఈ రూట్‌ పాస్‌ 27 (శనివారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Hyderabad: హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారా..? ఇది ఎంత గుడ్‌ న్యూస్ అంటే..

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా జనరల్‌ రూట్‌ పాస్‌కు (Route Pass) టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ప్రవేశపెట్టిన ఈ రూట్‌ పాస్‌ 27 (శనివారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించే వారికి ఇది వర్తించనుంది. ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్‌-24 టికెట్లతో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ఇస్తున్న విషయం తెలిసిందే.

City-Bus.jpg

నగరంలో ఇప్పటికే ప్రయాణికులకు జనరల్‌ బస్‌పాస్‌ అందుబాటులో ఉంది. ఆర్డీనరీ బస్‌పాస్‌కు రూ.1,150, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌కు రూ.1,300గా ధర ఉంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు మాత్రమే ఈ పాస్‌లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే వారు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారని తేలింది. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే రూట్‌ పాస్‌ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.

రాయితీతో అందజేత

సాధారణంగా ఆర్డీనరీ రూట్‌పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌పాస్‌కు రూ.1,200 ఉంటుంది. కొత్తగా ప్రారంభం నేపథ్యంలో ప్రయాణికులకు రూ.200 మేర రాయితీని కల్పించారు. సిటీ ఆర్డీనరీ రూట్‌ బస్‌పాస్‌ను రూ.600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌పాస్‌ రూ.వెయ్యికి అందించనున్నారు. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వేసవిలో ప్రయాణికులను ఆకర్షించేలా గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. సమ్మర్‌లో విద్యాసంస్థలకు సెలవుల నేపథ్యంలో సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గకుండా టికెట్లపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు ఆదాయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఏప్రిల్‌ 27 నుంచి రూ.100గా ఉన్న టీ-24 టికెట్‌ చార్జీని రూ.90 తగ్గించడంతో పాటు సీనియర్‌ సిటిజన్లకు రూ.80లకే వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల మహిళలకు ప్రత్యేకంగా టీ-24 టికెట్‌ చార్జీలను రూ.80లకు తగ్గించింది. ప్రస్తుతం విద్యా సంస్థలకు సెలవులు కావడంతో ఆ రూట్లలో నడిచే బస్సులను రద్దీ రూట్లలో నడిపించేందుకు చర్యలు చేపట్టింది.

టీ-6 టికెట్‌తో 6 గంటల ప్రయాణం..

నగరంలో ప్రైవేట్‌ ఆటోలో 2-3 కిలో మీటర్లు ప్రయాణం చేయాలన్నా రూ. 10నుంచి రూ.15 వరకు చార్జీ అవుతుంది. అదే ఆర్టీసీ బస్సుల్లో రూ.50 చెల్లించి టీ-6 టికెట్‌ తీసుకొని 6గంటలపాటు గ్రేటర్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ఎఫ్‌-24 టికెట్‌ అందుబాటులోకి తెచ్చింది. రూ.300తో ఈ టికెట్‌ తీసుకొని నలుగురు 24 గంటలపాటుసిటీ బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లొచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఏ ఆఫర్‌ టికెట్‌ అయినా బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ ఈ.యాదగిరి తెలిపారు. ఒక్కరోజులో నగరంలో ఎక్కువ ప్రాంతాలు తిరిగే వారు ఈ ప్రత్యేక టికెట్లు తీసుకుంటే చార్జీలు సగం వరకు తగ్గిపోతాయని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

ప్రత్యేక టికెట్లకు డిమాండ్‌

గ్రేటర్‌ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక టికెట్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మార్చిలో రోజుకు సుమారు 22,515 టీ-24 టికెట్లు అమ్మకాలు జరగ్గా, మొత్తం 6,97,966 టికెట్లు విక్రయించారు. ఏప్రిల్‌ నెలలో రోజుకు ప్రయాణికులు 24,996 టికెట్లు తీసుకోగా, మొత్తం 7,49,870 టికెట్ల అమ్మకాలు జరిగాయి. మే నెలలో రోజుకు 30,020 టికెట్ల అమ్మకాలు జరగ్గా, మూడు రోజుల్లో 90,060 టికెట్ల విక్రయించారు. సీనియర్‌ సిటిజన్ల టీ-24 టికెట్లు ఏప్రిల్‌లో రోజుకు 1,988 అమ్మకాలు జరిగితే మేనెలలో రోజుకు 2,271 టికెట్లకు పెరిగాయి. టీ-6 టికెట్లు మార్చిలో రోజుకు 1,994 అమ్మకాలు జరిగితే ఏప్రిల్‌లో- 3,897, మేలో - 4,894 పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-26T15:44:26+05:30 IST