TS Home Minister: హోంమంత్రీ.. ఇదేం పని? ఇలాంటి పనులతో..!

ABN , First Publish Date - 2023-10-07T04:11:19+05:30 IST

తన వ్యక్తిగత భద్రతను చూసే గన్‌మ్యాన్‌పై హోం మంత్రి మహమూద్‌ అలీ చేయిచేసుకున్నారు.

TS Home Minister: హోంమంత్రీ.. ఇదేం పని? ఇలాంటి పనులతో..!

  • గన్‌మన్‌కు మహమూద్‌ అలీ చెంపదెబ్బ

  • ప్రభుత్వ కార్యక్రమంలో అందరి ముందే ఘటన

  • పుష్పగుచ్ఛం అందివ్వకపోవడంతో అసహనం

  • ప్రతిపక్షాల ఆగ్రహం.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

  • పోలీసు అధికారుల సంఘం మౌనంపై చర్చ

హైదరాబాద్‌, అమీర్‌పేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తన వ్యక్తిగత భద్రతను చూసే గన్‌మ్యాన్‌పై హోం మంత్రి మహమూద్‌ అలీ (Mahmood Ali) చేయిచేసుకున్నారు. అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటనతో సదరు గన్‌మ్యాన్‌ దిగ్ర్భాంతి చెందారు. శుక్రవారం అమీర్‌పేట్‌లోని ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని’ మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మహమూద్‌ అలీ ప్రారంభించారు. తలసాని పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడంతో మహమూద్‌ అలీ ఆయనను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో తలసానికి ఇవ్వటానికి తీసుకొచ్చిన పుష్పగుచ్ఛం ఎక్కడని తన భద్రతా సిబ్బందిని హోం మంత్రి అడిగారు. పక్కనే ఉన్న గన్‌మ్యాన్‌ బాబు నాయక్‌ ఏదో చెప్పబోతుండగానే అతని చెంప చెళ్లుమనిపించారు. వాస్తవానికి హోంమంత్రి వెంట వేదిక వద్దకు హడావిడిగా వచ్చిన భద్రతాసిబ్బంది పుష్పగుచ్ఛాన్ని కారులోనే మరిచిపోయినట్లు సమాచారం. అయితే, ఊహించని ఈ ఘటనతో సదరు గన్‌మ్యాన్‌తోపాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. మంత్రి తలసాని హోం మంత్రిని సముదాయించారు. ఇంతలో వేరొకరు మహమూద్‌ అలీకి పుష్పగుచ్ఛం అందించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు మహమూద్‌ అలీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హోం మంత్రిగా ఉండి పోలీస్‌ సిబ్బందిపై చేయిచేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పోలీసు శాఖలో తీవ్ర చర్చ

ఈ ఘటనపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రిగా పోలీసుల గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించటం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసు అధికారుల సంఘం నేతలు స్పందించక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష నేతలు రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ గతంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. సంఘం నాయకులు ఆ వ్యాఖ్యలను ఖండించటంతోపాటు ఆ నేతలపై ఎక్కడికక్కడ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కానీ గన్‌మ్యాన్‌పై హోం మంత్రి అందరూ చూస్తుండగా చేయి చేసుకుంటే కనీసం నోరు మెదపలేని దుస్థితి ఏమిటని పోలీసుశాఖలో అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. వాస్తవానికి తమను ఎవరికైతే కేటాయించారో ఆ ప్రముఖుల భద్రతను పర్యవేక్షించడమే గన్‌మెన్ల బాధ్యత. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో భద్రతా సిబ్బంది అసలు విధులు పక్కన బెట్టి సహాయకుల మాదిరిగా, చెప్పిన పని చేస్తుండటం కూడా వారి స్థాయిని తగ్గిస్తోంది. ఈ క్రమంలో గన్‌మెన్లకు చాలా సందర్భాల్లో అవమానాలు ఎదురవుతున్నాయి.

కేసు నమోదు చేయాలన్న విపక్షాలు

హోంమంత్రి బహిరంగంగా పోలీసుపై చేయి చేసుకోవడాన్ని విపక్షాలు ఖండించాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందిస్తూ.. పోలీసు సిబ్బంది అంటే ఇంటి వద్ద కుక్కలు అనుకుంటున్నారా, లేక ఇంట్లో పనివాళ్లు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. హోం మంత్రిపై ఐపీసీ 323, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. సామాన్యులు, విపక్షాలు తమ విధులకు ఆటంకం కలిగిస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు ఈ దాడిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. డీజీపీ, పోలీస్‌ అధికారులు ఈ ఘటనపై స్పందించాలన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ.. కుటుంబసభ్యుల మాదిరిగా అన్ని వేళలా రక్షణ కల్పించే భద్రతా సిబ్బందిపై హోంమంత్రి చేయి చేసుకోవడం సరైంది కాదన్నారు. హోంమంత్రిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు బక్కా జడ్సన్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-10-07T10:55:26+05:30 IST