Raj bhavan: వివిధ విద్యార్థి సంఘాల ముట్టడి.. రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-03-14T12:19:59+05:30 IST

వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Raj bhavan: వివిధ విద్యార్థి సంఘాల ముట్టడి.. రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్‌ (Rajbhavan) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు (University Common Recruitment Board Bill)కు గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) వెంటనే ఆమోదం తెలపాలంటూ మంగళవారం ఉదయం వివిధ విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. బీఆర్‌ఎస్‌వీ (BRSV), ఇతర విద్యార్థి సంఘాల నేతలు రాజ్‌భవన్‌ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. గవర్నర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసిన వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ... యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం వల్ల సుమారు 3 వేల ప్రొఫెసర్ పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) చెప్పినట్లు గవర్నర్ తమిళిసై వింటున్నారని మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

గవర్నర్ వద్దే కీలక బిల్లులు...

కాగా... దాదాపు ఎనిమిది కీలక బిల్లులను గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) తన వద్దే పెట్టుకున్న విషయం తెలిసిందే. గతేడాది తెలంగాణ శాసనసభ, మండలిలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులను ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎనిమిది కీలక బిల్లులు గవర్నర్ ఆమోదం పొందలేదు. ఐదు నెలలు గడిచినప్పటికీ గవర్నర్ ఆ బిల్లులకు ఆమోదం తెలుపకుండా తనవద్దే ఉంచుకున్నారు.

ఆ ఎనిమిది బిల్లులు ఇవే...

1. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు

2. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు

3. జీఎస్టీ చట్ట సవరణ

4. ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ

5. మున్సిపల్‌ చట్ట సవరణ

6. పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ

7. ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు

8. మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు

అయితే 8 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకపోవడంతో దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈనెల 2న సుప్రీంలో పిటిషన్ వేశారు. రాజ్‌భవన్‌ తీరుపై మండిపడ్డారు.

కాగా... సుప్రీంలో పిటిషన్‌పై గవర్నర్ తమిళిసై తనదైన శైలిలో స్పందించారు. శాంతికుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక... రాజ్‌భవన్‌కు వచ్చేందుకు సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ కన్నా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ దగ్గరే అని సీఎస్‌కు మరోసారి గుర్తుచేస్తున్నా అంటూ గవర్నర్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో వివాదం సమసిపోయిందని అంతా భావించారు. ఇంతలోనే పెండింగ్ బిల్లుల అంశం మళ్లీ తెరపైకి రావడంతో గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం ఎప్పుడు సమసిపోతుందో వేచి చూడాలి.

Updated Date - 2023-03-14T13:42:59+05:30 IST