CM KCR: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం...

ABN , First Publish Date - 2023-06-02T12:11:23+05:30 IST

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

CM KCR: తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం...

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గన్‌పార్క్‌ (Gunpark)లో అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సచివాలయంలో సీఎం వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల (Telangana State Decade Celebrations) శుభ సందర్భంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ‘సంపద పెంచుదాం-ప్రజలకు పంచుదాం’ అని అన్నారు. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్యను పరిష్కరించామని, మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయని అన్నారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేటి ఉజ్వల తెలంగాణ అని, సాగుకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం పేర్కొన్నారు.

2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 మాత్రమే ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. పదేళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచిందన్నారు. 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగిందన్నారు. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట తెలంగాణ నిలిచిందన్నారు.

ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసిందన్నారు. వృత్తి పనులవారికి ఆర్ధిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయని, మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయని, పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయన్నారు. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తోందని, ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కిందన్నారు.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. వృత్తి పనుల వారికి ఆర్ధిక ప్రేరణ

దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నామని చెప్పడానికి తానెంతో ఆనందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే విధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టిన సంగతి తెలిసిందేనన్నారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుందన్నారు.

పోడు భూములకు పట్టాలు

తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నదని, జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నదని, దీనికి రైతుబంధు పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-02T12:11:23+05:30 IST