TS News: ఇంద్రకరణ్ రెడ్డి‌కి మహేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్

ABN , First Publish Date - 2023-03-28T19:52:09+05:30 IST

మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి‌కి కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇంద్ర కరణ్ రెడ్డికి దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

TS News: ఇంద్రకరణ్ రెడ్డి‌కి మహేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్

హైదరాబాద్: మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి‌కి కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఇంద్ర కరణ్ రెడ్డికి దమ్ముంటే వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి, దొంగ జపం చేసినట్లు ఉందని ఆయన విమర్శించారు. ఆరు నెలల్లోనే ఐదు పార్టీలు మారిన చరిత్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. పార్టీ మారాలనుకుంటే తనకు అడ్డు ఎవరు? కష్టమైనా నష్టమైనా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. మున్సిపల్ ఉద్యోగ నియామకాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన ఎంతోమంది నిరుద్యోగులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

ఇదిలావుండగా... కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్ రెడ్డి (Maheswar Reddy) పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగాల నియామాకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. తప్పుడు ఆరోప‌ణ‌లు కాదు.... ఆధారాలుంటే బ‌య‌ట‌పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. నిరూపిస్తే చ‌ట్టం ప్ర‌కారం ఏ శిక్ష‌కైనా సిద్ధమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప‌నైపోయిందని ఎద్దేవా చేశారు. రేపో మాపో మహేశ్వర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి జోస్యం చెప్పారు.

Updated Date - 2023-03-28T19:52:18+05:30 IST