Swami Vivekananda: భాగ్యనగరంలోనే తొలి శంఖారావం

ABN , First Publish Date - 2023-02-13T19:54:11+05:30 IST

ఈ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు

Swami Vivekananda: భాగ్యనగరంలోనే తొలి శంఖారావం
Swami Vivekananda Day

హైదరాబాద్: స్వామి వివేకానంద (Swami Vivekananda) తొలి శంఖారావం మన భాగ్యనగరంలోనేనని రామకృష్ణ మ‌ఠం (Ramakrishna Mutt) అధ్య‌క్షులు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) తెలిపారు. స్వామి వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని కొద్దిమందికి మాత్రమే తెలుసని చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ (Secunderabad Mahbub Degree College) లో జరిగిన 'వివేకానంద డే' (Vivekananda Day) కార్య‌క్ర‌మంలో భాగంగా యువతను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన స్వామి వివేకానంద ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో "మై మిషన్ టు ద వెస్ట్" (Mission to the West) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారని స్వామి బోధమయానంద చెప్పారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరయ్యారని తెలిపారు. నాడు ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారన్నారు.

వివేకానంద డే వేడుకల ఫొటో గ్యాలరీ...

ఆ తొలి ప్రసంగంలో స్వామి వివేకానంద హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి వివరించారని స్వామి బోధమయానంద తెలియజేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారని, భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు వివేకానంద స్పష్టం చేశారని బోధమయానంద తెలిపారు. అమెరికా (America)లోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభ (Chicago World Religion Conference)లో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌ (Hyderanad) బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష కోరల్లో చిక్కుకోవద్దని రామకృష్ణ మ‌ఠం అధ్య‌క్షులు స్వామి బోధ‌మ‌యానంద యువతను హెచ్చరించారు.

Vivekananda Day at Mahbub College

వివేకానంద ఇనిస్టిట్యూట్ అఫ్ లాంగ్వేజెస్ (Vivekananda Institute of Languages) డైరెక్టర్ స్వామి శితికంఠానంద (Swami Shitikantananda) మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్ల భాషా మంత్రాలని అభివర్ణించారు. యువత వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి పొందాలని సూచించారు.

రామకృష్ణ ప్రభ (Ramakrishna Prabha) సంపాదకులు స్వామి పరిజ్ఞేయానంద మాట్లాడుతూ ఫిబ్రవరి 13 'వివేకానంద డే' ప్రాధాన్యత గురించి సమాజంలో మరింత అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాదేనని చెప్పారు.

మహబూబ్ కాలేజీ అధ్యక్షులు పి.ఎల్.శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి 'వివేకానంద డే' వేడుకల్లో వేలాదిమంది పాల్గొనేలా చేస్తానన్నారు.

కార్యక్రమంలో మహబూబ్ కాలేజీ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, కార్యదర్శి భగవత్ వారణాసి, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ ఎక్స‌లెన్స్ అధ్యాప‌కులు, వాలంటీర్లు, పాల్గొన్నారు. కార్యక్రమానికి వాలంటీర్ నారాయణరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.

Updated Date - 2023-02-13T19:58:04+05:30 IST