Sriram Shobhayatra: హైదరాబాద్‌లో శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-30T14:28:11+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభమైంది.

Sriram Shobhayatra: హైదరాబాద్‌లో శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్: శ్రీరామనవమి (Sriramanavami Celebrations) సందర్భంగా పాతబస్తీ (Old City)లోని సీతారాంబాగ్ రామమందిరం నుంచి శ్రీరామ్ శోభాయాత్ర(Sriram Shobhayatra) ప్రారంభమైంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయమశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. మొత్తం 6.5 కిలో మీటర్ల మేర శోభాయాత్ర జరుగనుంది. శ్రీరామ్ శోభాయాత్రలో భారీగా భక్తలు పాల్గొన్నారు. సీతారాంబాగ్‌ ఆలయం - బోయగూడ కమాన్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది.

శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, ఆక్టోఫస్ బలగాలతో శోభాయాత్రపై నిఘా పెట్టారు. డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ యాత్రను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

భక్తులు సహకరించాలి: సుధీర్

శ్రీరామ్ శోభాయాత్రపై హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... శ్రీరామ్ శోభాయాత్ర సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయమశాల వరకు సాగే ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వెల్ కమ్ స్టేజెస్ భారీ కెడ్స్ అవతల పెట్టిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు భక్తులందరు సహకరించాలని సుదీర్ బాబు కోరారు.

Updated Date - 2023-03-30T14:28:11+05:30 IST