Ambedkar statue: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్

ABN , First Publish Date - 2023-04-14T15:59:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది.

Ambedkar statue: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం (Ambedkar Statue) ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో ((Grandson of Dr. BR Ambedkar, former Lok Sabha member Prakash Ambedkar) ) కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేడ్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్‌ అంబేడ్కర్ సందర్శించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాఫ్టర్ ద్వారా అంబేడ్కర్ విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వం పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో మొత్తం 11.6ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. మహా విగ్రహం కొలువుదీరిన ప్రాంగణం ఆరు ఎకరాల వరకు ఉంటుంది. అందులో విగ్రహ నిర్మాణ ప్రాంతం 1.5 ఎకరం కాగా, మిగతా స్థలంలో ఉద్యానవనం, రాక్‌ గార్డెన్‌, ఫౌంటెన్‌ వంటివి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.146 కోట్లు. ఇప్పటి వరకు రూ.84కోట్లు వెచ్చించారు. మిగతా నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. స్మారక భవనం మీద నేలవైన అంబేడ్కర్‌ విగ్రహం పాదాల చెంతకు వెళ్లడానికి ఇరువైపులా మెట్ల దారిని, ఒకే సారి 15 మంది వెళ్లగలిగే రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. భారీ భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా, వందల ఏళ్ల పాటు విగ్రహం చెక్కు చెదరకుండా పటిష్టమైన లోహాన్ని ఉపయోగించారు. లోపలి వైపు స్టీల్‌కు పాలీయురేథీన్‌ కోటింగ్‌ చేశారు. స్మారక భవనం ఉన్న ప్రాంతమంతా అడుగున రాయి ఎక్కువగా ఉండడంతో పునాదుల వరకు భవనం నిర్మించేందుకే ఆరు నెలల సమయం పట్టిందని నిర్మాణ సంస్థ బాధ్యులు చెబుతున్నారు.

ప్రకాష్ అంబేడ్కర్‌‌కు సాదర స్వాగతం..

అంతకుముందు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రకాష్ అంబేడ్కర్‌ను ప్రగతిభవన్‌లో సాదర స్వాగతం లభించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు ఆహ్వానం పలుకుతూ... శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రకాష్‌తో కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం భోజనంతో ప్రకాష్‌కు కేసీఆర్ (Telangana CM) అతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే, సిద్దోజీరావు తదితరులు పాల్గొన్నారు.అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్.. డా. బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం నూతన సచివాలయాన్ని ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. నూతన సెక్రెటరియేట్ నిర్మాణ పనులు, ప్రత్యేకతలను ప్రకాష్ అంబేడ్కర్‌‌కు కేసీఆర్ వివరించనున్నారు.

Updated Date - 2023-04-14T16:13:18+05:30 IST