PV Narasimha Rao: దేశానికి పీవీ సేవలు ఎనలేనివి: సంజయ్ బారు

ABN , First Publish Date - 2023-01-07T19:07:30+05:30 IST

దేశ సంక్షోభ సమయంలో వినూత్న ఆర్థిక విధానాలతో దేశాన్ని కాపాడిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మహనీయుడని ప్రముఖ పాత్రికేయులు, ఆర్థికరంగ రచయిత సంజయ్ బారు కొనియాడారు.

PV Narasimha Rao: దేశానికి పీవీ సేవలు ఎనలేనివి: సంజయ్ బారు

హైదరాబాద్, జనవరి 07: దేశ సంక్షోభ సమయంలో వినూత్న ఆర్థిక విధానాలతో దేశాన్ని కాపాడిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మహనీయుడని ప్రముఖ పాత్రికేయులు, ఆర్థికరంగ రచయిత సంజయ్ బారు కొనియాడారు. ఆధునిక భారతానికి పీవీ సేవలు శ్లాఘనీయమన్నారు. దేశ ప్రగతికి పీవీ అందించిన సేవలు ఎనలేనివని కితాబిచ్చారు. నెహ్రూవియన్ మిశ్రమ ఆర్థిక విధానం నుంచి పీవీ అనుభవాలు నేర్చుకొని దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారన్నారు. ఆ సంస్కరణ కారణంగానే ఆధునిక భారత నిర్మాణానికి పీవీ పునాదులు వేశారని సంజయ్ బారు చెప్పారు. అంతటి మహనీయుడికి కాంగ్రెస్ తగిన గుర్తింపు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. పీవీ స్మారకోపన్యాసoలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.

Untitled-10.jpg

పీవీ విదేశీ విధానం, అకాడమీ పాలసీలు అద్భుతంగా ఉండేవని సంజయ్ బారు వెల్లడించారు. పరిపాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారని, నూతన ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని ఆయన ప్రశంసించారు. ఇందిరా గాంధీ కేంద్రీకృత విధానాలను అనుసరించారని అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశ ప్రగతి కుంటుబడిందని వెల్లడించారు. అటుతర్వాత ఆ గుణపాఠాలను పీవీ నేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆయన దిద్దిబాటు చర్యలు చేపట్టారని వివరించారు. పీవీ దేశ పారిశ్రామిక రంగంలో గుణాత్మక, నిర్మాణాత్మక మార్పులకు కారణమని సంజయ్ బారు చెప్పారు. పీవీ వంటి నేత దేశానికి లేకపోవడంతో నాయకత్వ లోపంగా మారిందన్నారు. పీవీ, అటల్, మన్మోహన్ సింగ్ దేశ అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. నేడు దేశం ఆ స్ఫూర్తిని కోల్పోయిందని సంజయ్ బారు పేర్కొన్నారు.

Untitled-11.jpg

పీవీ కర్మయోగి అని, దేశానికి అంకితభావంతో సేవ చేశారని పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రతి సమస్యను అవకాశంగా తీసుకోని పీవీ ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేవారని అన్నారు. తక్కువ ప్రొఫైల్ మెయిన్ టైన్ చేసి దేశానికి ఏo చెయాలో చేసి చుపించారని తెలిపారు. అనారోగ్యంగా ఉండి అమెరికాలో ఆయన ఆపరేషన్ చేయించుకున్న తరువాత తాను ఈ దేశానికి చేయాల్సిన కార్యం ఏదో ఉందని వ్యాఖ్యలు చేసినట్టు ప్రభాకర్ రావు గుర్తు చేసుకున్నారు. అటు తర్వాత ప్రధాని అయ్యారని చెప్పారు. దేశమే ఊపిరిగా బతికిన ఆ మహనీయుడిని మనమంతా మననం చేసుకోవాలని గుర్తుజు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రాంచందర్ రావు మాట్లాడుతూ నెహ్రూ తర్వాత జాతి నిర్మాణంలో పీవీ అంతటి కీలకపాత్ర పోషించారని వివరించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నెహ్రు డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాశారని... పీవీ మాత్రం డిస్కవర్డు ఇండియా అంటే ఏంటో చూపించారని అన్నారు. పీవీ రాష్ట్ర మంత్రి గా ఉన్నపుడు కర్నూలులో పెట్టిన కాలేజీలో తాను చదువుకొని ఈ స్థాయి వచ్చినట్టు ఆయన నెమరు వేసుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు శర్మ ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తాత గారితో పీవీ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన తాత అవధానానికి పీవీ ఢిల్లీ నుండి ప్రత్యేకoగా వచ్చారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు జితేందర్ రావు, అనిల్, బీఎల్ఎస్వీ ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Untitled-9.jpg

Updated Date - 2023-01-07T19:12:30+05:30 IST