Hyderabad: నాలా పూడికతీతలో నయా విధానం..వారికి చెక్ పెట్టేందుకేనా ?

ABN , First Publish Date - 2023-04-12T13:45:58+05:30 IST

ఉన్నతస్థాయి ఆదేశాలతో ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రణాళికాబద్ధంగా ..

Hyderabad: నాలా పూడికతీతలో నయా విధానం..వారికి చెక్ పెట్టేందుకేనా ?

  • ఎమ్మెల్యేల కనుసన్నల్లో జీహెచ్‌ఎంసీ నయా విధానం

  • గ్రేటర్‌లో 56 పనులు

  • చార్మినార్‌ జోన్‌లోనే 29

  • రూ.53.59 కోట్లతో ప్రతిపాదనలు

  • ఒక్కో సర్కిల్‌లో ఒక్కో ఏజెన్సీ ఎంపిక

నాలాల పూడికతీత(Nala Clearance ) రూటు మారింది. శాసనసభ్యుల కనుసన్నల్లో పనులు జరిగేలా అధికారులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఉన్నతస్థాయి ఆదేశాలతో ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అక్రమాలను సాకుగా చూపుతూ.. పూడికతీతకు సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతానికి భిన్నంగా సర్కిల్‌కు ఓ ఏజెన్సీకి పనులు అప్పగించే కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చారు.

హైదరాబాద్‌: చార్మినార్‌ జోన్‌(Charminar Zone)లోని కొన్ని సర్కిళ్లు మినహా గ్రేటర్‌లోని దాదాపు అన్ని సర్కిళ్లలో కాంట్రాక్ట్‌ సంస్థల ఎంపిక పూర్తయిందని ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. కొన్నిచోట్ల పనులూ మొదలయ్యాయి. 2023కు సంబంధించి రూ.53.59 కోట్లతో నాలాల పూడికతీత ప్రతిపాదనలు రూపొందించారు. గతంలో గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించి ఒక్కో డివిజన్‌లో రెండు, మూడు ప్యాకేజీలుగా ప్రతిపాదనలు రూపొందించేవారు. 300 నుంచి 350 పనులుగా విభజించి ఏజెన్సీలను ఎంపిక చేసేవారు. ప్రయోగాత్మకమంటూ ఈ యేడాది పాత విధానం మార్చేశారు. సర్కిల్‌ పరిధిలోని అన్ని నాలాల పూడికతీత పనులు ఒక ప్యాకేజీ చొప్పున ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

మెజార్టీ సర్కిళ్లలో ఏజెన్సీలనూ ఎంపిక చేశారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో మాత్రం గతంలోమాదిరే 20 వరకు ప్యాకేజీలుగా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ సర్కిల్‌లో పూడికతీత పనుల ఏజెన్సీల ఎంపిక పూర్తయింది. చార్మినార్‌ జోన్‌లోని ఇతర సర్కిళ్లలో స్పందన లేకపోవడంతో మరోసారి బిడ్‌లు ఆహ్వానించారు. రెండోసారి టెండర్‌ ప్రకటనకు స్పందన రాని పక్షంలో డివిజన్ల వారీగా పనులు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకేనా..?

వార్డుల వారీగా పూడికతీత ప్రక్రియకు స్వస్తి పలకాలని నగరంలోని పలువురు శాసనసభ్యులు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సూచించినట్టు తెలిసింది. సర్కిళ్ల వారీగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్న వారి విజ్ఞప్తికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే నయా విధానం అమలవుతోంది. పూడికతీత సక్రమంగా జరగడం లేదన్న ఫిర్యాదులు ప్రతి యేటా వస్తున్నాయి. 2020 పనులపై విచారణ జరిపిన విజిలెన్స్‌ పూర్తిస్థాయిలో పూడిక తొలగించలేదని నిర్ధారించింది. జరగని పనులకు బిల్లులు చెల్లించవద్దని సూచిస్తూ..నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈఈ, డీఈఈ, ఏఈఈలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయం షోకాజ్‌ నోటీసుల దశలో ఉంది.

ఈ నేపథ్యంలో ఇకనుంచి పూర్తిస్థాయిలో పూడికతీత జరిగేలా చూడాలన్న ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్యాకేజీలు రూపొందించి పెద్ద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో అసలు ఉద్దేశం వేరే ఉందని, ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేందుకే సర్కిళ్ల వారీగా పనులు చేపట్టాలని నిర్ణయించారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రేటర్‌లో బీజేపీ రికార్డు స్థాయి డివిజన్లలో గెలిచింది. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన 43మంది, కాంగ్రెస్‌ నుంచి నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రాజకీయ వార్‌ నేపథ్యంలో ప్రతిపక్ష కార్పొరేటర్లకు చెక్‌ పెట్టేందుకు నూతన విధానం అవలంభిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

డివిజన్ల వారీగా పనులు చేపడితే..స్థానిక కార్పొరేటర్ల పెత్తనం ఉంటుందని భావించి కొందరు ఎమ్మెల్యేలు.. వ్యూహాత్మకంగా సర్కిళ్ల వారీ పనుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్టు చెబుతున్నారు. శాసనసభ్యుల తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లూ..కొత్తగా చేపడుతోన్న పూడికతీత పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-12T13:45:58+05:30 IST