Kutumbarao: కానూరు ట్రస్ట్ భూములు కాజేయాలని వైసీపీ నేతల యత్నం

ABN , First Publish Date - 2023-06-23T12:50:21+05:30 IST

కానూరు ట్రస్ట్ భూములను కాజేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆరోపించారు.

Kutumbarao: కానూరు ట్రస్ట్ భూములు కాజేయాలని వైసీపీ నేతల యత్నం

హైదరాబాద్: ఏపీలోని విజయవాడ శివారులో ఉన్న కానూరు ట్రస్ట్ భూముల (Kanuru Trust Lands) విషయంలో ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాసరావును (NRI Srinivas rao) ఏపీ పోలీసులు వేధించారంటూ ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు (former Vice Chairman of AP Planning Board Kutumbarao) పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై శుక్రవారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో కుటుంబరావు మాట్లాడుతూ.. కానూరు ట్రస్ట్ భూములను కాజేయాలని వైసీపీ నేతలు (YCP Leaders) చూస్తున్నారని ఆరోపించారు. ట్రస్ట్ భూములు పరిరక్షించేందుకు ఎన్‌ఆర్‌ఐ శ్రీనివాస్ రావు న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎలాగైనా భూములు దక్కించుకోవాలనే వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే పెనుములూరు పోలీస్ స్టేషన్‌లో కుదరవల్లి శ్రీనివాసరావుపై అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు. యాదగిరి గుట్టకు వెళ్లి వస్తున్న కుదరవల్లి శ్రీనివాసరావు కూతురును, కుటుంబ సభ్యులను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారన్నారు.

కారు అడ్డుగించి ఓ ప్రైవేటు కారులో నలుగురు కానిస్టేబుల్స్ మహిళలు అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ చేశారన్నారు. ఇద్దరు మహిళలను ఉదయం 11 గంటలు నుంచి రాత్రి 7 వరకు బందీగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కోర్టుకు వెళ్లిన కుదరవల్లి శ్రీనివాసరావును కూడా వైసీపీ నేతలు కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేశారన్నారు. కుదరవల్లి శ్రీనివాసరావు కుమార్తె, బావమర్ది, ఆయన సతీమణి, కుమారుడిని వాహనం అడ్డగించి మఫ్టీలో ఉన్న కానిస్టేబుళ్లు తీసుకెళ్లారని తెలిపారు. కుమార్తె సెల్ నుంచి శ్రీనివాసరావు ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నం చేశారన్నారు. డయల్ 100కు కాల్ చేయడంతో తెలంగాణ పోలీసులు స్పందించి కాపాడినట్లు చెప్పారు. ఆపై అక్రమంగా నిర్బంధించారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని... న్యాయపోరాటం చేస్తామని కుటుంబసభ్యులు చెబుతున్నారని కుటుంబరావు వెల్లడించారు.

Updated Date - 2023-06-23T12:50:21+05:30 IST