ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల Danda of seats in engineering colleges

ABN, First Publish Date - 2023-05-17T04:54:30+05:30 IST

VDanda of seats in engineering colleges

వర్సిటీ హోదా రాక ముందే సీట్లు ఎలా ఇస్తారు?

విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోరా?: సంజయ్‌

హైదరాబాద్‌ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోందని, చివరకు విద్యార్థుల భవిష్యత్‌ నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. పైవ్రేటు వర్సిటీ హోదా రాకుండానే శ్రీనిధి, గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు 4 వేల మంది విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుని వాళ్ల జీవితాలను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. ఆయా కాలేజీల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్‌ చేసి, చితకబాదడం సిగ్గుచేటన్నారు. తక్షణమే బాధ్యులైన ఏసీపీసహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏబీవీపీ విభాగ్‌ కార్యాలయాన్ని బండి సంజయ్‌ సందర్శించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పరామర్శించారు. ఇంతవరకు ఎంసెట్‌ ఫలితాలు రాలేదని, కానీ అప్పుడే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల దందా మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు రాకముందే పైవ్రేటు వర్సిటీల పేరుతో దందా జరుగుతోందన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నాయకులపై కేసులు నమోదు చేయించడం సిగ్గుచేటన్నారు. ఏబీవీపీ నాయకులను చితకబాదిన ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోకపోతే మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. దళితులను కించపర్చేలా మాట్లాడిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated at - 2023-05-17T04:55:30+05:30