Hyderabad: అమిత్ షా పర్యటలో స్వల్ప మార్పులు..

ABN , First Publish Date - 2023-04-23T07:49:23+05:30 IST

చేవెళ్లలో బీజేపీ (BJP) ఆదివారం నిర్వహించ తలపెట్టిన ‘విజయ సంకల్ప సభ’ (Vijaya Sankalpa Sabha)కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Hyderabad: అమిత్ షా పర్యటలో స్వల్ప మార్పులు..

హైదరాబాద్: చేవెళ్లలో బీజేపీ (BJP) ఆదివారం నిర్వహించ తలపెట్టిన ‘విజయ సంకల్ప సభ’ (Vijaya Sankalpa Sabha)కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన చేవెళ్లకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. అయితే ఈ పర్యటన సందర్భంగా అమిత్‌షా నోవాటెల్‌ హోటల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా యూనిట్‌ను కలవాల్సి ఉంది. అలాగే బీజేపీ ముఖ్యనేతలతో భేటీ జరగాల్సి ఉంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఈ రెండు కార్యక్రమాలను రద్దు చేశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సభ ముగియగానే అమిత్ షా తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఇక చేవెళ్లలో నిర్వహించబోయే బహిరంగ సభ ఒక సంచలనం కావాలని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సత్తా చాటాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

కాగా సభలో అమిత్‌ షా అభివృద్ధి కార్యక్రమాలపై కీలక ప్రకటన చేస్తారని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బండి సంజయ్‌ శనివారం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయ సంకల్ప సభ ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీపై నమ్మకంతో ఉన్నారని చెప్పారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని, తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను సీఎం కేసీఆర్‌ మరిన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా, సభ ఏర్పాట్లను చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపే శక్తి కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. అమిత్‌ షా పర్యటన సందర్భంగా చేవెళ్లలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-04-23T07:49:23+05:30 IST