Telangana Medical seats: మెడికల్ సీట్ల భర్తీపై కేంద్రం ఏం చెప్పిందంటే..!
ABN , First Publish Date - 2023-07-21T16:04:55+05:30 IST
మెడికల్ సీట్ల భర్తీకి (Medical seats) కేంద్రీకృత కౌన్సెలింగ్ లేదని కేంద్రం తేల్చిచెప్పింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ: మెడికల్ సీట్ల భర్తీకి (Medical seats) కేంద్రీకృత కౌన్సెలింగ్ లేదని కేంద్రం తేల్చిచెప్పింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023-24 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు కేంద్రీకృత కౌన్సెలింగ్ కోసం ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. వివిధ కోటాలకు సీట్ల కేటాయింపులో ప్రస్తుతం ఉన్న స్కీమ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా.... డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్- DGHS, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ-MCCలు ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సుల సీట్ల కోసం కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. యూజీ, పీజీ మెడికల్ కోర్సుల్లో స్టేట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని సమాధానంలో తెలిపింది. సీట్లలో కేవలం 15 శాతం మాత్రమే ఆలిండియా కోటా ఉంటుందని కేంద్రం తేల్చి చెప్పింది.