Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్..

ABN , First Publish Date - 2023-01-19T11:06:18+05:30 IST

ఢిల్లీ: ఖమ్మం జిల్లాలో నిన్న సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు.

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్..

ఢిల్లీ: ఖమ్మం జిల్లాలో నిన్న సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఖమ్మంలో కేసీఆర్‌ సభకు కుమారస్వామి, నితీష్‌కుమార్‌ రాలేదన్నారు. ఇప్పుడు వచ్చినవాళ్ళు ఇంకా మళ్లీ రారని అన్నారు. లిక్కర్‌ పైసలు పంచుకునేందుకే నేతలు వచ్చారని విమర్శించారు. దేశంపై సీఎం కేసీఆర్‌ ద్వేషం పెంచుకున్నారని, యాదాద్రిపై ఖర్చు చేస్తే భారీగా ఆదాయం వస్తుందని కేటీఆర్‌ అన్నారు.. ఆలయాలపై ఖర్చు చేయండి నిధులు వస్తాయని ఇతర సీఎంలకు చెప్పారా? అని ప్రశ్నించారు. గోదావరి నీటిని వాడుకునే తెలివి ముఖ్యమంత్రికి లేదని బండి సంజయ్ విమర్శించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కూడా వదులుకున్న వ్యక్తి కేసీఆర్‌ అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బోర్ల సంఖ్య 18 లక్షల నుంచి 24 లక్షలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఏ గ్రామానికైనా ఇస్తున్నారా?.. విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. కరెంట్‌ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెలియదన్నారు. రైతులకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని బండి సంజయ్‌ విమర్శించారు.

దేశాన్ని నెహ్రూ జమానాకు తీసుకుపోవాలనేది సీఎం కేసీఆర్‌ ప్రయత్నమని, అగ్నిపథ్‌ గురించి సీఎం ఒక్కసారైనా ఆలోచించారా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసుల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. అంబేద్కర్‌ జయంతి, వర్థంతికి రాని కేసీఆర్‌.. దళితులకు ఏం మేలు చేస్తారన్నారు. డిస్కమ్‌లకు ఇంకా బకాయిలు చెల్లించడం లేదని, ప్రభుత్వ పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు.

నిన్న సభలో జై తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ అనలేదని, ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి ఏంటో ఈసారి జనం చూపిస్తారని బండి సంజయ్ అన్నారు. సీఎం మాటలకు ఎవరూ చప్పట్లు కొట్టలేదన్నారు. కేసీఆర్ వేషం, మాటలు అన్ని తుపాకీ రాముడివేనని ఎద్దేవా చేశారు. నిన్న సభకు వచ్చిన నలుగురు నాలుగు స్కామ్‌ల్లో ఉన్నారని.. ఒకరు లిక్కర్‌, మరొకరు గోల్డ్‌, ఇంకొకరు మైన్‌ స్కామ్‌లో ఉన్నారన్నారు. మజ్లిస్‌తో కలిసి తిరిగే మీరు మతతత్వం గురించి మాట్లాడతారా? అంటూ బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-01-19T11:06:18+05:30 IST