Share News

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయండి

ABN , First Publish Date - 2023-11-11T07:14:29+05:30 IST

కూకట్‌పల్లి(Kukatpally)లో వందల కోట్ల రూపాయల విలువైన దాదాపు 13 ఎకరాల భూకేటాయింపు విషయంలో

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయండి

- కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో ఉద్యోగులకు ప్లాట్ల వ్యవహారం

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి(Kukatpally)లో వందల కోట్ల రూపాయల విలువైన దాదాపు 13 ఎకరాల భూకేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. 1991లో జారీచేసిన జీవో ప్రకారం హౌసింగ్‌ బోర్డుకు చెందిన 320 మంది ఉద్యోగులకు ప్రత్యేక ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేయాలని హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. 1991లో అప్పటి ఏపీ హౌసింగ్‌ బోర్డు తీర్మానం మేరకు కూకట్‌పల్లి నాలుగో ఫేజ్‌లో 320 మంది హౌసింగ్‌ బోర్డు ఉద్యోగులకు ఒక్కొక్కరికి చదరపు గజం రూ.45 లెక్కన 200 గజాలు కేటాయిస్తూ జీవో నెంబర్‌ 2ను జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 103 మంది ఉద్యోగులు పూర్తి ఇన్‌స్టాల్‌మెంట్లను చెల్లించగా.. 217 మంది ఉద్యోగులు చెల్లించలేదు. తర్వాత ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి ప్రత్యేకంగా ప్లాట్లు కాకుండా ఫ్లాట్లు నిర్మించి విక్రయించాలని నిర్ణయించింది. 1991 నాటి ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తూ 2006లో జీవో నెంబర్‌ 32 జారీచేసింది. తమకు చేసిన భూకేటాయింపును రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు, చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ ఉద్యోగులు మాధవరెడ్డి, రామకోటేశ్వర్‌రావు 2006లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌.. మొత్తం ఇన్‌స్లాల్‌మెంట్లు చెల్లించిన 103 మంది ఉద్యోగులకు జీవో 2 ప్రకారం ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయించాలని.. డబ్బు కట్టని 217 మందికి 2006లో జారీచేసిన జీవో 32 ప్రకారం భవనాలు నిర్మించిన తర్వాత ఫ్లాట్లు కొనుక్కునే అవకాశం కల్పించాలని లేదా డబ్బు తిరిగి తీసుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు 217 మంది ఉద్యోగులు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లారు.

2009లో దాఖలు

2009లో దాఖలైన దాదాపు 12 అప్పీల్‌ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఉద్యోగుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగికి ప్రత్యేక ప్లాట్‌ కేటాయిస్తామని చెప్పి తర్వాత వాటిని ఫ్లాట్స్‌గా మారుస్తామనడం అన్యాయమన్నారు. డెవలప్‌మెంట్‌ చార్జీలను పెంచడం వల్లే కొంతమంది ఉద్యోగులు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించలేకపోయారని, దానికి ఉద్యోగులను శిక్షించడం సమంజసం కాదని వాదించారు. ఈ మేరకు సింగిల్‌ జడ్జి తీర్పు కొట్టేసి మొత్తం 320 మందికి ప్రత్యేక ప్లాట్లు కేటాయించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్‌ బోర్డు తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూమి కొరత వల్లే ప్రభుత్వం ఫ్లాట్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఉద్యోగుల వాదనతో ఏకీభవిస్తూ ప్రభుత్వ అప్పీళ్లను కొట్టేసింది. 1991 నాటి జీవో 2 ప్రకారం మొత్తం 320 మంది ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. అప్పట్లో ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించని ఉద్యోగుల నుంచి డిఫరెన్స్‌ మొత్తాన్ని స్వీకరించి 4 నెలల్లో ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేయాలని కీలక తీర్పు వెలువరించింది.

Updated Date - 2023-11-11T07:14:30+05:30 IST