TS News: రుణమాఫీ లేకుండా.. రైతు సంబురాలెందుకు?.. ఎమ్మెల్యే కందాళను నిలదీసిన రైతులు
ABN , First Publish Date - 2023-06-03T20:09:02+05:30 IST
లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు.. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు.. బ్యాంకు వడ్డీలు కట్టలేక చస్తున్నాం.. రుణమాఫీ చేయలేనప్పుడు ఈ రైతు సంబురాలెందుకు..
ఖమ్మం: ‘‘లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు.. ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు.. బ్యాంకు వడ్డీలు కట్టలేక చస్తున్నాం.. రుణమాఫీ చేయలేనప్పుడు ఈ రైతు సంబురాలెందుకు?’’ అంటూ ఖమ్మం జిల్లా (Khammam District) నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి రైతువేదికలో అధికారపార్టీకి చెందిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి (MLA Kandala Upender Reddy)ని రైతులు నిలదీశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం కందాళ ఉపేందర్‌రెడ్డి మండ్రాజుపల్లిలో రైతు సంబరాలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు రైతులు ఎమ్మెల్యే కందాళ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వ పెద్దలు ‘రైతుబంధు’ ఇస్తామని చెబుతున్నా.. ఆ డబ్బులు బ్యాంకు వడ్డీలకే సరిపోవడంలేదని వాపోయారు. ‘రైతుబంధు’ సాయం కంటే బ్యాంకుల్లో రుణాల వడ్డీ అధికంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలు పరిష్కరించలేనప్పుడు రైతు సంబురాలు ఎందుకని నిలదీశారు.
ఊహించని విధంగా రైతులు తిరుగుబాటు చేయడంతో ఎమ్మెల్యే కందాళ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎవరో చెప్పిన మాటలు విని ఇక్కడ మాట్లాడుతున్నారని, ఐదెకరాలు, 10 ఎకరాలున్న రైతులుకూడా రైతుబంధు తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. అలాగే రుణమాఫీ కూడా చెస్తామని ఎమ్మెల్యే చెప్పడంతో రైతులు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘రైతుబంధు’ అందరికీ ఇస్తున్నప్పుడు రుణమాఫీ అందరికీ ఎందుకు చేయడంలేదని ఎదురు ప్రశ్నించారు. దాంతో రైతులకు ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేసినా రైతుల ఆగ్రహంతో సభా వేదిక ముందుకు నిలుచున్నారు. రైతులకోసం ప్రభుత్వం ఒక్కో పథకాలు అమలు చేస్తోందని, ఈ క్రమంలో రైతురుణమాఫీ కూడా తప్పక చేస్తుందని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సమాధానం చెప్పినా శాంతించలేదు. దీంతో ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని పూర్తిచేయకుండానే సభ నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి వెళ్లిపోయారు.