Share News

TS News: ప్రభుత్వం నడపడం చేత గాక అప్పులు అని మాట్లాడుతున్నారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్

ABN , Publish Date - Dec 30 , 2023 | 06:48 PM

ప్రభుత్వం నడపడం చేత గాక అప్పులు అని మాట్లాడుతున్నారని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు దాటిందని, సీఎం హామీ ఇచ్చినా పనులు చేయకుండా అప్పులయ్యాయని ప్రతి రోజూ ఒకటే పాట పడుతున్నారని విమర్శించారు.

TS News: ప్రభుత్వం నడపడం చేత గాక అప్పులు అని మాట్లాడుతున్నారు: కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: ప్రభుత్వం నడపడం చేత గాక అప్పులు అని మాట్లాడుతున్నారని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు దాటిందని, సీఎం హామీ ఇచ్చినా పనులు చేయకుండా అప్పులయ్యాయని ప్రతి రోజూ ఒకటే పాట పడుతున్నారని విమర్శించారు. పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, పని చేయకుండా అప్పులంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అప్పులు, ఆస్తుల వివరాలు ప్రజల ముందు ఉంచామని, దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదని ఆయన ప్రస్తావించారు. కేంద్రం కూడా అప్పులు చేసిందనే విషయం అందరికీ తెలుసన్నారు.


‘‘ నిన్నటి వరకు కాంగ్రెస్ పాలించిన రాజస్థాన్‌లో విద్యుత్ సంస్థలు రూ.53 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం నడపడం చేత గాక అప్పులు అని మాట్లాడుతున్నారు. భట్టికి చేతనైతే రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల లెక్కలు తెప్పించుకొండి. అన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి. 24 గంటల విద్యుత్ ఇవ్వడం తెలియక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ దేశంలో 39 విద్యుత్ ప్లాంట్స్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పే ఇప్పుడు రూ.88 వేల కోట్లకు పెరిగింది. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కష్టాలు మొదలయ్యాయి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 2017 లోపు పూర్తి చేసే ప్రాజెక్టులకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొచ్చని చట్టంలో ఉంది. మీరు పాలించిన రాష్ట్రాల్లో లంకె బిందులు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ రావడం లేదని భట్టి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. ఎక్కువ రోజులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు. ఇచ్చిన పాలనపై దృష్టి పెట్టండి హామీలు నెరవేర్చండి. అభయ హస్తం దరఖాస్తు ఫారంలో బ్యాంక్ అకౌంట్ ఎందుకు అడగలేదు?. తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఏమి ఇవ్వమని ముందే ఎందుకు చెప్పలేదు?. కార్లు కొన్నారని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కార్లు షెడ్డులో ఉండక పోతే రోడ్ల మీద ప్రదర్శన పెడతారా?’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Dec 30 , 2023 | 06:48 PM