Share News

Collector: ఇది లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో చాలెంజ్‌గా పని చేశాను..

ABN , First Publish Date - 2023-12-13T08:19:12+05:30 IST

‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నాకు లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా

Collector: ఇది లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో చాలెంజ్‌గా పని చేశాను..

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ పూర్తిగా సహకరించారు

- టీం వర్క్‌తో ఆటంకాలు ఎదురుకాలేదు

- ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నాకు లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చాయి. 2019లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలైలో ఇక్కడికి వచ్చాను. ఎన్నికల విధుల్లో తొలిసారిగా.. అది హైదరాబాద్‌ లాంటి పెద్ద జిల్లాలో పనిచేయడం నా అదృష్టం. షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచే ప్రతి పనినీ చాలెంజ్‌గా తీసుకున్నా. అధికారులు, ఉద్యోగులు పరస్పర సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశాం..’’ అని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) అన్నారు. ఇప్పుడు చేపట్టిన విధులు భవిష్యత్‌ ఎన్నికల నిర్వహణపై భరోసానిచ్చాయని.. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో సమర్ధవంతంగా నిర్వహించిన కలెక్టర్‌ మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.

3 లక్షల ఓట్లను తొలగించాం..

ఎన్నికల్లో భాగంగా అత్యంత కీలకమైన డూప్లికేట్‌, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులంతా తీవ్రంగా కష్టపడ్డారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లను దాదాపు 3 లక్షల వరకు తొలగించారు. వీటితోపాటు ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటాన్ని గుర్తించాం. వారందరినీ ఒకేచోటకు తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేసి జాబితాను తయారు చేయడంతో పలుచోట్ల పోలింగ్‌శాతం పెరిగింది.

రెండు, మూడుసార్లు శిక్షణ..

జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయడం సవాల్‌గా ఉంటుందని కొంతమంది అధికారులు నాతో చెప్పారు. సమర్ధవంతంగా నిర్వహించాలనే పట్టుదలతో ముందుకు సాగాను. జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి హోదాలో అన్ని అంశాలపై దృష్టిసారించాను. ప్రధానంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాం. ప్రతి నియోజకవర్గానికీ 9 టీమ్‌లను ఏర్పాటు చేశాం.

30 వేల మంది పనిచేశారు..

జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసుతోపాటు వివిధశాఖల అధికారులు, ఉద్యోగులతో కలిసి ఎన్నికల్లో దాదాపు 30వేల మంది వరకు పనిచేశారు. అక్టోబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 3 వరకు దాదాపు 54 రోజులపాటు అందరం ‘రౌండ్‌ ది క్లాక్‌’గా పనిచేశాం. అక్రమంగా తరలిస్తున్న నగదు, డబ్బును పట్టుకోవడం లాంటివి కఠినంగా నిర్వహించాం. పాతబస్తీలాంటి ప్రాంతాల్లో కూడా చిన్నపాటి అలజడి లేకుండా పకడ్బందీగా పనిచేశాం. అధికారులతోపాటు రాజకీయ పార్టీలను కూడా ప్రతి పనిలో ఇన్వాల్వ్‌ చేయడంతో ఇబ్బందులు రాలేదు.

Updated Date - 2023-12-13T08:19:13+05:30 IST