Adani: అదానీ షేర్ల విలువ పతనంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-29T19:19:22+05:30 IST

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అదానీ షేర్ల విలువ పతనంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Adani: అదానీ షేర్ల విలువ పతనంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Chandrashekar Rao comments on Gautam Adani

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అదానీ షేర్ల విలువ పతనంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పోరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని, తమకు అనుకూల కార్పోరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తోందని ఆరోపించారు. ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతున్నదని, వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. బడా వ్యాపారవేత్తల లాభాలు సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమైతున్నదని, ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రం తీరని నష్ట చేస్తున్నదన్నారు. లాభాలను ప్రైవేట్ పరం చేస్తూ...నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతూ..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరిని బిఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖంఢించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రోజు రోజుకూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, దేశ యువతను ఏమాత్రం పట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భధ్రత కల్పించకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ తీరని నష్టం చేస్తున్నదన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని, ఇందుకు సంబంధించి పార్లమెంటులో గొంతు వినిపించాలని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే!

‘‘కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనిపైనా పార్లమెంటులో నిలదీయాలి. ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని నిలదీయాల్సి వున్నది. అక్కడితో ఆగకుండా గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధునుల నిర్వర్తిస్తూ కేంద్ర రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను బిఆర్ఎస్ ఎంపీలుగా మీరు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని మీరు పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి. దేశ భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యల మీద పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద పోరాటానికి మనతో కలిసివచ్చే ప్రతిఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోండి. పెట్రోల్ డీజిల్ సహా వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నయి. సామాన్యుడి బతుకు పెరుగుతున్న ధరలతో రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలను కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకపోవాలె. ’’ అని కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చించింది. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతున్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. బిఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్ రావు (లోక్ సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-29T19:26:43+05:30 IST