TS News: విద్యార్థి నాయకుని నుంచి పొలిట్‌ బ్యూరో మెంబర్‌ దాకా.. కటుకం సుదర్శన్‌ నేపథ్యం ఇదే..

ABN , First Publish Date - 2023-06-04T20:40:40+05:30 IST

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్‌ కమిటీ, పొలిట్‌ బ్యూరో మెంబర్‌, భారత విప్లవ ఉద్యమ నాయకుడు కటుకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, అలియాస్‌ దూలా (69) మృతి చెందారు.

TS News: విద్యార్థి నాయకుని నుంచి పొలిట్‌ బ్యూరో మెంబర్‌ దాకా.. కటుకం సుదర్శన్‌ నేపథ్యం ఇదే..

మంచిర్యాల: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సెంట్రల్‌ కమిటీ, పొలిట్‌ బ్యూరో మెంబర్‌, భారత విప్లవ ఉద్యమ నాయకుడు కటుకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, అలియాస్‌ దూలా (69) మృతి చెందారు. మే 31న దండకారణ్య అటవీ ప్రాంతంలో గుండెపోటుకు గురై మరణించినట్లు పార్టీ కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, డయాబెటిస్‌, బీపీ సమస్యలతో కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించినట్లు పేర్కొన్నారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్‌ స్మారక సభ నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు అభయ్‌ తెలిపారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కార్మిక కుటుంబంలో సామాన్య కుటుంబంలో జన్మించిన సుదర్శన్‌ 1974లో మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేశారు. శ్రీకాకుళం పోరాటాల స్ఫూర్తితో విద్యార్థిగా విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్‌ విద్యార్థి సంఘం నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. 1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, 1980లో ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో దండకారుణ్య ఫారెస్టు కమిటీకి ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (పీపుల్‌ వార్‌) కేంద్ర కమిటీ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన ఆయన సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో సెక్రెటరీగా 2017 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకున్న కటుకం సుదర్శన్‌ సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో (సీఆర్‌బీ) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, సెంట్రల్‌ కమిటీ మీడియా ప్రతినిధిగా రెండేళ్లుగా కొనసాగుతున్నారు.

దాడుల్లో నిపుణుడు

నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల సమయంలో పార్టీ వైపు ఆకర్షితుడై సుదీర్ఘకాలం ఎర్రజెండా ఎత్తుకుని జీవనం సాగించిన కటుకం సుదర్శన్‌ తొలితరం విప్లవకారుల్లో ఒకరు. సుమారు 50 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపిన కటుకం సుదర్శన్‌ పోలీసులపై దాడిలో దిట్టగా పేరొందారు. గురి తప్పకుండా లక్ష్యం చేధించడంలో మాస్టర్‌ మైండ్‌గా ఆయనకు పేరుంది. 2013లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా దర్భాఘాటిలో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడిలో 27 మంది మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారి కటుకం సుదర్శనే. 2010 ఏప్రిల్‌ 6న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లా చింతల్‌నార్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి ఘటనలో సుదర్శన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. సుదర్శన్‌ ఛత్తీస్‌గఢ్‌లో సైనిక దళాలపై మిలటరీ దాడుల ప్రణాళిక గెరిల్లా వార్‌ ఫేర్‌లో మావోయిస్టు కేడర్‌కు శిక్షణ ఇచ్చేవారు. కటుకం సుదర్శన్‌పై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 21కి పైగా కేసులు ఉన్నాయి.

Updated Date - 2023-06-04T20:40:40+05:30 IST