Share News

Revanth Reddy: లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు సూచన

ABN , First Publish Date - 2023-11-15T19:00:03+05:30 IST

జనగామ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది అని రేవంత్ అన్నారు.

Revanth Reddy: లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో.. ధర్మం వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు సూచన

జనగామ: జనగామ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది అని రేవంత్ అన్నారు. ఈజనసందోహాన్ని చూస్తుంటే కాలనాగుల పని పట్టడానికి పుట్టలోనుంచి చీమలు బయటకు వచ్చినట్లుందని ఆయన అన్నారు.

"జనగామలో పల్లాను ఓడించి బొంద పెట్టడానికి వచ్చిన మీకు అభినందనలు. పొన్నాల లేడని ఇక్కడ ఇబ్బంది జరుగుతదేమో అనుకున్నా. కానీ మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. కన్నతల్లి లాంటి పార్టీని, కార్యకర్తలను మోసం చేసినవారికి బండకేసి కొడతామని నిరూపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసి చెప్పిండు. వీళ్లిద్దరి బాగోతం గడీలో ఉన్న దొరకు తెలుసు. ఈ ప్రాంతంలో మట్టికి ఒక పౌరుషం ఉంది. దొరల రాజ్యంపై పోరాటం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఈ ప్రాంతానిది. పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా?. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను మోసం చేసి పొన్నాల శత్రువు పంచన చేరాడు. అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్ పంచన చేరాడు. జనగామ ప్రజలు లక్ష కోట్లు దోచుకున్న దొంగ వైపు ఉంటారో ధర్మం వైపు ఉంటారో తేల్చుకోండి." అని ప్రజలకు రేవంత్ రెడ్డి సూచించారు.

"ప్రజా ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు సోనియమ్మ 6 గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాహిళలకు ప్రతీ నెల రూ.2500 అందిస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తాం. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్‌లోకి కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంది లేకుంటే ఏంది?. కేసీఆర్ ఉంటే మీకు వచ్చే పెన్షన్ రూ.2వేలు.. కేసీఆర్‌ను బొందపెడితే రూ.4వేలు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేయూత పథకం ద్వారా నెలకు రూ.4వేలు పెన్షన్ అందిస్తాం." అని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-11-15T19:03:47+05:30 IST