Criticisms on Cricket pitches: ప్చ్.. ఇవేం పిచ్‌లు?.. ఇండోర్‌లో ఆస్ట్రేలియాకు అప్పనంగా విజయం!

ABN , First Publish Date - 2023-03-03T19:49:54+05:30 IST

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా పరాజయంతో సగటు క్రికెట్ అభిమాని మెదడులో క్రికెట్ పిచ్‌లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి...

Criticisms on Cricket pitches: ప్చ్.. ఇవేం పిచ్‌లు?.. ఇండోర్‌లో ఆస్ట్రేలియాకు అప్పనంగా విజయం!

ఆస్ట్రేలియాతో (IndiaVsAustralia 3rd test) మూడో టెస్టు వేదిక మారకుంటే బాగుండేదేమో? ముందుగా అనుకున్న ధర్మశాలలో జరిగినా బాగుండేదేమో? కొద్ది రోజులు మాత్రమే ఉండగా.. మ్యాచ్ జరిగే వేదికను మార్చడంతో మంచి పిచ్ రూపొందించేందుకు పెద్దగా వ్యవధి చిక్కలేదు మొదటి టెస్టు జరిగిన నాగపూర్ పిచ్ కంటే ఘోరంగా ఏమీ లేదు.. రెండో టెస్టు జరిగిన ఢిల్లీ పిచ్ కంటే తీసిపోలేదు కదా..? నాలుగో టెస్టు జరిగే అహ్మదాబాద్‌లో పేస్ పిచ్ కోరుతామని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చెప్పాడు.. మరిప్పుడు ఏమంటాడో..? ..ఇవీ ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్టులో టీమిండియా పరాజయంతో సగటు క్రికెట్ అభిమాని మెదడులో మెదులుతున్న ప్రశ్నలు. పేరుకు ఆస్ట్రేలియా-భారత్ (Australia Vs India) నాలుగు టెస్టుల సుదీర్ఘ సిరీస్. కానీ, మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే పూర్తయిపోయాయి. ఇంకా చెప్పాలంటే సరిగ్గా రెండు పావు రోజుల్లోనే ముగిశాయి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో బలమైన టెస్టు జట్టు ఆస్ట్రేలియాతో ఇలాంటి నిస్సారమైన సిరీస్‌ను అభిమానులు ఊహించి ఉండరు.

మరీ ఇంత స్పిన్నా..?

indore-pitch.jpg

అతి ఎక్కడైనా ఇబ్బందికరమే. ఈ విషయం ఆసీస్-భారత్ సిరీస్‌లో‌నూ (Border- Gavaskar Trophy) కళ్లకు కనిపిస్తోంది. పూర్తి స్పిన్ పిచ్‌లు తయారు చేసి ప్రత్యర్థి పని పడదామని చూస్తే.. అది అంత సులువు కాదని అర్థమైపోయింది. మూడో టెస్టులో ఫలితం ఎదురుతన్నింది. రెండు టెస్టుల్లోనూ చేతులెత్తేసి.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాకు అప్పనంగా విజయాన్ని అందించింది. 177 & 91, 263 & 113, 197 & 78/1.. ఇవీ మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా స్కోర్లు. 400, 262 & 118/4, 109 & 163.. ఇవి టీమిండియా స్కోర్లు. మొదటి టెస్టులో మినహా ఎక్కడా ఇన్నింగ్స్ స్కోర్లు 300 దాటని వీటిని చూస్తేనే తెలిసిపోతోంది పరుగులు చేయడానికి బ్యాట్స్ మెన్ ఎంత కష్టపడ్డారో..? అంతలా స్పిన్‌కు సహకరించాయి పిచ్‌లు. టీమిండియా పేసర్లు సిరాజ్, షమీ, ఉమేశ్ (మూడో టెస్టులో), ఆసీస్ తరఫున కమ్మిన్స్, స్టార్క్ (మూడో టెస్టులో) కొన్ని వికెట్లు తీసినా అవి వారి మెరుగైన బంతులకు దక్కినవే.

ఇండోర్‌లో మరీ ఇంత దారుణమా?

వాస్తవానికి మూడో టెస్టు వేదిక ధర్మశాల. అయితే, అక్కడ ఔట్ ఫీల్డ్ బాగోలేదని.. మ్యాచ్ నిర్వహణకు తగిన వేదిక కాదని ఇండోర్ కు మార్చారు. కానీ, అదే టీమిండియాకు పెద్ద దెబ్బయింది. అందులోనూ టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడమూ కొంపముంచింది. పిచ్‌ను పసిగట్టిన అతడు కనీసం 250 పరుగులు చేయగలిగితే చాలని అనుకున్నాడు. కానీ, మొదటి గంటలోనే బంతి తిరగడం మొదలైన పిచ్‌పై వంద దాటడమే కష్టమైపోయింది. ఆ పై ఆస్ట్రేలియాకు కోల్పోయిన 88 పరుగుల ఆధిక్యం మరీ పెద్దదై పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడినా ఆ స్కోరు సరిపోలేదు. దీంతో ఇండోర్ పిచ్ మీద విమర్శలు వస్తున్నాయి. కానీ, మంచి పిచ్ తయారీకి తగినంత సమయం లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఐసీసీ ఈ పిచ్ కు ఎంత రేటింగ్ ఇస్తుందో చూడాలి. అభిమానుల కోణంలో చూస్తే.. కచ్చితంగా ‘‘పూర్’ అని మాత్రం చెప్పొచ్చు.

Untitled-15.jpg

అహ్మదాబాద్ లో ఎలాగుంటుందో?

నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో జరగనుంది. వరుసగా రెండు టెస్టులు గెలిచిన ఊపులో మూడో దాంట్లోనూ ఎదురులేదని భావించాడు రోహిత్ శర్మ. ఇండోర్ టెస్టులో గెలిస్తే అహ్మదాబాద్‌లో పచ్చిక పిచ్ ను కోరతామని చెప్పాడు. కానీ, ఇప్పుడు వ్యతిరేక ఫలితం వచ్చింది. ఇండోర్ అనుభవాన్ని బట్టి చూస్తే.. ఆస్ట్రేలియా కూడా స్పిన్‌తో మనల్ని దెబ్బకొట్టగలదని నిరూపితమైంది. మరి చివరిదైన నాలుగో టెస్టులో భారత జట్టు యాజమాన్యం ఏం చెబుతుందో చూడాలి.

Untitled-14.jpg

డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఇబ్బంది లేదు.. కానీ..

భారత్‌పై ఇండోర్‌లో విజయంతో ఆసీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. టీమిండియా రెండో స్థానంలో ఉంది. మనకు ఇప్పటికీ ఫైనల్ చేరే వీలుంది. అయితే, శ్రీలంక నుంచి ముప్పు పొంచి ఉంది. ఆ జట్టు ఈ నెలలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. లంక గకను కివీస్‌పై సిరీస్‌ను 2-0 తేడాతో గెలిచి, మనం ఆసీస్‌తో నాలుగో టెస్టులో ఓడితే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు కోల్పోయినట్లే. ఒకవేళ లంక రెండు టెస్టులూ గెలిచి, మనం నాలుగో టెస్టులో విజయం సాధిస్తే మనకు ఫైనల్ బెర్తు పక్కా. లంక న్యూజిలాండ్ తో ఒక్క టెస్టు ఓడిపోయినా భారత్‌ ముందంజ వేస్తుంది. ఇదే సమయంలో ఆసీస్‌పై నాలుగో టెస్టు గెలిస్తే అగ్రస్థానంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది. కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కంగారూ జట్టు 68.52 శాతంతో టాప్‌లో ఉంది. భారత్ 60.29 శాతంతో రెండో, శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొసమెరుపు ఏంటంటే.. ఆసీస్-టీమిండియా నాలుగో టెస్టు, లంక- న్యూజిలాండ్ తొలి టెస్టు ఈ నెల 9 నుంచే మొదలుకానున్నాయి.

Updated Date - 2023-03-03T19:50:48+05:30 IST