IPL 2023 KKR vs GT : రింకూ మాయ

ABN , First Publish Date - 2023-04-10T00:50:42+05:30 IST

సొంత గడ్డ..అందునా రెండు మ్యాచ్‌లు గెలిచిన జోరులో గుజరాత్‌..200కు పైగా స్కోరు..వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా మెరుపు ఇన్నింగ్స్‌కు

IPL 2023 KKR vs GT : రింకూ మాయ

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు

వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ

రషీద్‌ హ్యాట్రిక్‌, విజయ్‌ ఇన్నింగ్స్‌ వృథా

ఆఖరి ఓవర్లో గుజరాత్‌పై కోల్‌కతా అద్భుత విజయం

సొంత గడ్డ..అందునా రెండు మ్యాచ్‌లు గెలిచిన జోరులో గుజరాత్‌..200కు పైగా స్కోరు..వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడడం, కెప్టెన్‌ రషీద్‌ హ్యాట్రిక్‌తో 155/7తో కోల్‌‘కథ’ ముగిసి ఇక టైటాన్స్‌దే విజయం అనుకున్న వేళ..యువ బ్యాటర్‌ రింకూసింగ్‌ విధ్వంసం సృష్టించాడు.

ఐపీఎల్‌ చరిత్రలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అదరహో అనిపించాడు. చివరి ఓవర్లో కోల్‌కతా గెలుపునకు 29 పరుగులు అవసరమైన తరుణంలో మీడియం పేసర్‌ యశ్‌ దయాళ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడి వరుసగా ఐదు సిక్సర్లు బాది నైట్‌రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

అహ్మదాబాద్‌: ఏం మ్యాచ్‌..పరుగుల ప్రవాహం..వికెట్ల పతనం.. ప్రధాన బ్యాటర్ల ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. తిప్పేసిన స్పిన్నర్లు.. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఆపై గుజరాత్‌ టైటాన్స్‌వైపు విజయం దోబూచులాట.. చివరగా ఇక గుజరాత్‌దే మ్యాచ్‌ అనుకున్న సమయాన ఒకే ఒక్కడు.. 25 ఏళ్ల కోల్‌కతా ఎడమచేతి బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఐదు బంతుల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు..ఫలితంగా ఆదివారం జరిగిన పోరులో నైట్‌రైడర్స్‌ 3 వికెట్లతో అనూహ్య విజయం సాధించింది. మొదట గజరాత్‌ 20 ఓవర్లలో 204/4 స్కోరు చేసింది. విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 నాటౌట్‌), సాయిసుదర్శన్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), గిల్‌ (31 బంతుల్లో 5 ఫోర్లతో 39) సత్తాచాటారు. నరైన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 207/7 స్కోరుతో నెగ్గింది. ఇంపాక్ట్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ (40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83) చెలరేగాడు. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) రాణించాడు. ఇక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రింకూ సింగ్‌ (21 బంతుల్లో ఫోర్‌, 6 సిక్స్‌లతో 48 నాటౌట్‌) కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రషీద్‌ (3/37) ఐపీఎల్‌లో తన తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. హార్దిక్‌కు అనారోగ్యంతో రషీద్‌ గుజరాత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అయ్యర్‌, రాణా అదరహో: భారీ ఛేదనలో గుర్బాజ్‌ (15), జగదీశన్‌ (6) త్వరగా నిష్క్రమించడంతో కోల్‌తా 28/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా మూడో వికెట్‌కు వంద రన్స్‌ జత చేశారు. ముఖ్యంగా ఇంపాక్ట్‌ బ్యాటర్‌గా వచ్చిన అయ్యర్‌ ఫోర్లు, సిక్సర్లతో 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ చేరాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీలో తొలుత నితీశ్‌ను అనంతరం అయ్యర్‌ను అవుట్‌ చేసిన జోసెఫ్‌ గుజరాత్‌ను రేస్‌లోకి తెచ్చాడు. 17వ ఓవర్లో రస్సెల్‌ (1), నరైన్‌ (0), శార్దూల్‌ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చిన రషీద్‌ హ్యాట్రిక్‌తో గుజరాత్‌కు గెలుపు ఖాయమన్నట్టు చేశాడు.

ఆఖర్లో రింకూ విధ్వంసం ఇలా..: కానీ అటాకింగ్‌ బ్యాటింగ్‌తో గుజరాత్‌ నుంచి రింకూసింగ్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. మొదట సింగిల్స్‌ తీస్తూ జట్టును తీవ్ర ఒత్తిడిలో పడేసిన రింకూ.. జోష్‌ లిటిల్‌ వేసిన 19వ ఓవర్లో 6,4తో కోల్‌కతాలో ఆశలు రేపాడు. అప్పటికి రైడర్స్‌ స్కోరు 176/7. అంటే ఆఖరి ఓవర్లో గెలుపునకు 29 రన్స్‌ చేయాలి. కోల్‌కతా డగౌట్‌లో నరాలు తెగే ఉత్కంఠ. మరోవైపు విజయంపై గుజరాత్‌లో ధీమా. ఈ తరుణంలో ఎడమ చేతి పేసర్‌ యశ్‌ దయాళ్‌ వేసిన 20వ ఓవర్‌ తొలి బంతికి ఉమేశ్‌ ఒక పరుగు తీయడంతో రింకూ స్ట్రయిక్‌కు వచ్చాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవలిగా వేసిన బంతిని లాంగాఫ్‌ దిశగా బలంగా కొట్టాడు. అంతే బంతి సిక్స్‌కు తరలగా నైట్‌రైడర్స్‌లో ఉత్సాహం. తరువాతి బంతి ఫుల్‌టాస్‌. ముందుగానే క్రీజు వదిలి వచ్చిన రింకూ స్క్వేర్‌లెగ్‌ దిశగా సంధించాడు. తదుపరి బంతీ ఫుల్‌టాసే. దానిని నీట్‌గా లాంగా్‌ఫలోకి పంపించాడు. ఈసారి ఆఫ్‌స్టంప్‌ ఆవలిగా బంతి రాగా..లాంగాన్‌ దిశగా బాదేశాడు. దాంతో కోల్‌కతాలో మరింత జోష్‌. గుజరాత్‌ ఫీల్డర్లలో నిరాశ. కెప్టెన్‌ రషీద్‌, గిల్‌ తదితరులు గ్రౌండ్‌ మధ్యలో సమావేశమై ఆఖరి బంతిని ఎలా వేయించాలనేది చర్చించారు. ఆ బంతిని యశ్‌ మళ్లీ ఆఫ్‌స్టంప్‌ వెలుపల వేయగా..లాంగాన్‌ దిశగా అలవోకగా రింకూ సిక్సర్‌కు తరలించాడు. అంతే.. కోల్‌కతా జట్టంతా వచ్చి సంబరాల్లో మునగగా.. గుజరాత్‌ ఆటగాళ్లు నిరాశకు లోనయ్యారు.

శంకర్‌, సాయి హాఫ్‌ సెంచరీలు.: గుజరాత్‌ 200 రన్స్‌కుపైగా చేసిందంటే యువ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌, విజయ్‌ శంకరే కారణం. ఢిల్లీతో గత పోరులో అజేయంగా హాఫ్‌ సెంచరీ చేసిన సుదర్శన్‌..ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఇక గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో ఏమాత్రం రాణించలేకపోతున్న విజయ్‌ శంకర్‌ ఈ మ్యాచ్‌లో తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. కెప్టెన్‌ హార్దిక్‌ స్థానంలో జట్టులోకొచ్చినవిజయ్‌ ఎడాపెడా షాట్లతో హోరెత్తించాడు. మరో యువ ఆటగాడు గిల్‌, సాయి కూడా సత్తా చాటడంతో గుజరాత్‌ స్కోరు 200 మార్క్‌ దాటింది.

ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌ రింకూ సింగ్‌

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (సి) జగదీశన్‌ (బి) నరైన్‌ 17, గిల్‌ (సి) ఉమేశ్‌ (బి) నరైన్‌ 39, సాయి సుదర్శన్‌ (సి) సబ్‌ రాయ్‌ (బి) నరైన్‌ 53, అభినవ్‌ మనోహర్‌ (బి) సుయాశ్‌ 14, విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 63, మిల్లర్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 20 ఓవర్లలో 204/4; వికెట్లపతనం: 1/33, 2/100, 3/118, 4/153; బౌలింగ్‌: ఉమేశ్‌ 3-0-24-0, శార్దూల్‌ 3-0-40-0, ఫెర్గూసన్‌ 4-0-40-0, నరైన్‌ 4-0-33-3, వరుణ్‌ 2-0-27-0, సుయాశ్‌ 4-0-35-1.

కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) యశ్‌ (బి) షమి 15, జగదీశన్‌ (సి) మనోహర్‌ (బి) లిటిల్‌ 6, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 83, నితీశ్‌ (సి) షమి (బి) జోసెఫ్‌ 45, రింకూ (నాటౌట్‌) 48, రస్సెల్‌ (సి) సబ్‌ భరత్‌ (బి) రషీద్‌ 1, నరైన్‌ (సి) సబ్‌ జయంత్‌ (బి) రషీద్‌ 0, శార్దూల్‌ (ఎల్బీ) రషీద్‌ 0, ఉమేశ్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు:4, మొత్తం: 20 ఓవర్లలో 207/7; వికెట్లపతనం: 1/20, 2/28, 3/128, 4/154, 5/155, 6/155, 7/155; బౌలింగ్‌: షమి 4-0-28-1, లిటిల్‌ 4-0-45-1, జోసెఫ్‌ 4-0-27-2, యశ్‌ దయాళ్‌ 4-0-69-0, రషీద్‌ 4-0-47-3.

Updated Date - 2023-04-10T00:50:58+05:30 IST