India-Australia ODI: టిక్కెట్ల కోసం పోటెత్తిన అభిమానులు.. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా..
ABN , First Publish Date - 2023-03-19T10:43:07+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఈ నెల 22వ తేది స్థానిక చేపాక్కం స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు శనివారం

పెరంబూర్(చెన్నై): భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఈ నెల 22వ తేది స్థానిక చేపాక్కం స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని మద్రాస్ క్రికెట్ సంఘం (ఎంసీసీ) ప్రకటించింది. 2019 తర్వాత చెన్నైలో జరుగనున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కావడంతో అభిమానులు స్టేడియంలో స్వయంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టేడియంలో మొత్తం సామర్థ్యం 35 వేలు కాగా, ఆన్‌లైన్‌లో 30 వేల టిక్కెట్ల విక్రయాలు ఇప్పటికే ముగిశాయి. స్టేడియంలోని సీ,డీ,ఈ ఏసీ గ్యాలరీ, ఐ,జే,కే గ్యాలరీలు, ఎఫ్,జి వీఐపీ గ్యాలరీల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించారు. సీ,డీ,ఈ గ్యాలరీలకు సంబంధించిన 5,100 టిక్కెట్లు కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే పెద్దసంఖ్యలో పలు జిల్లాలు, ఆంధ్ర నుంచి అభిమానులు తరలివచ్చారు. రాత్రి వర్షం పడుతున్నా లెక్కచేయని అభిమానులు క్యూలో వేచి ఉన్నారు. ఉదయం 11 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, నాలుగు గంటల్లోనే టిక్కెట్లు మొత్తం విక్రయమయ్యాయి. దీంతో, వేలాది మంది అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. టిక్కెట్ల విక్రయం సందర్భంగా స్టేడియం, పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.