India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

ABN , First Publish Date - 2023-09-18T01:17:30+05:30 IST

చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్‌ సిరాజ్‌.. ఐదేళ్ల తర్వాత భారత్‌కు ఆసియాకప్‌ను అందించాడు. ..

India Asia Cup: సిరాజ్‌ సిక్సర్‌.. భారత్‌దే ఆసియా కప్‌

ఫైనల్లో లంక 50కే ఆలౌట్‌

గత రెండు మ్యాచ్‌లు ఆఖరి ఓవర్‌ వరకు హోరాహోరీగా సాగడంతో.. ఆసియాకప్‌ ఫైనల్‌(Asia Cup Final) అంతకు మించిన మజా ఇస్తుందని అందరూ భావించారు. కొదమ సింహాల్లా పోరాడే భారత్‌, లంక జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌ కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. కానీ, పేసర్‌ సిరాజ్‌ నిప్పులు చెరగడంతో వార్‌ వన్‌సైడయింది. వరుసపెట్టి లంక టాపార్డర్‌ వికెట్లను కూల్చిన సిరాజ్‌(Siraj).. ఒంటిచేత్తో టీమిండియాకు ట్రోఫీ అందించాడు. వరల్డ్‌కప్‌ ముందు జట్టులో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.

ఓ వన్డే టోర్నీ ఫైనల్లో 10 వికెట్ల తేడాతో గెలవడం టీమిండియాకిది రెండోసారి. అంతకుముందు 1998లో షార్జాలో జరిగిన ఫైనల్లో జింబాబ్వేపై 10 వికెట్లతో నెగ్గింది.

వన్డేల్లో భారత్‌పై లంకకిదే అత్యల్ప స్కోరు. కాగా, ఓవరాల్‌గా ఆ జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. గతంలో సౌతాఫ్రికా (2012లో)పై 43 పరుగులకు ఆలౌటైంది.

2018లో ఆసియాకప్‌ నెగ్గిన తర్వాత ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నీలో కప్‌ నెగ్గడం భారత్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా వన్డే ఫార్మాట్‌లో ఏడుసార్లు, టీ20 ఫార్మాట్‌లో ఒకసారి భారత్‌ ఆసియా విజేతగా నిలిచింది.

11.jpg


ఈ రోజు నాదే

వ్యూహం ప్రకారం తగిన లెంగ్త్‌తో బౌలింగ్‌ చేశా. స్వింగ్‌ దొరకడంతో వీలైనంతగా బ్యాటర్లు ఆడేలా బంతులేశా. సహచరుల నుంచి కూడా తగిన సహకారం లభించడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగా. ఈ రోజు నాకు అదృష్టం రాసిపెట్టుంది.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ప్రైజ్‌మనీ వారికే

వర్షం కురిసినా మ్యాచ్‌లు నిర్వహించడానికి గ్రౌండ్స్‌మెన్‌ ఎంతో శ్రమించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ద్వారా నాకు లభించిన 5వేల డాలర్ల ప్రైజ్‌మనీని గ్రౌండ్స్‌మెన్‌కే ఇస్తున్నా. సిరాజ్‌

1993లో హీరో కప్‌ ఫైనల్లో అనిల్‌ కుంబ్లే (6/12) తర్వాత.. ఓ టోర్నీ తుది పోరులో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా సిరాజ్‌ (6/21).

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్‌. ఓవరాల్‌గా చమిందా వాస్‌, సమి, రషీద్‌ తర్వాత ఈ ఘనతను అందుకొన్న బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

వన్డేల్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా సిరాజ్‌ (1002 బంతుల్లో). అజంతా మెండిస్‌ (847 బంతులు) టాప్‌లో ఉన్నాడు.

కొలంబో: చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్‌ సిరాజ్‌(Siraj).. ఐదేళ్ల తర్వాత భారత్‌(India)కు ఆసియాకప్‌ను అందించాడు. డిఫెండింగ్‌ చాంప్‌ శ్రీలంక(Sri Lanka)తో ఆదివారం హోరాహోరీగా జరుగుతుందనుకొన్న టైటిల్‌ ఫైట్‌లో సిరాజ్‌ (7-1-21-6) ఆరు వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరవడంతో.. టీమిండియా 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రోహిత్‌ సేన(Rohit Sena) రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్‌ను(Asia Cup) ముద్దాడింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. కుశాల్‌ మెండిస్‌(Kushal Mendis) (17) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఐదుగురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 6.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (23 నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (27 నాటౌట్‌) మరో 263 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయతీరాలకు చేర్చారు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌ను టీమిండియా 116 నిమిషాల్లో ముగించడం విశేషం. సిరాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కగా.. కుల్దీప్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీ్‌స’గా నిలిచాడు.

లంక బ్యాటింగ్‌ కకావికలం: సిరాజ్‌ విజృంభణతో లంక బ్యాటింగ్‌ అల్లకల్లోలమైంది. హైదరాబాదీ పేసర్‌ మాయాజాలానికి ఒక్క ఓవర్‌లోనే నాలుగు టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకొన్న లంక మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకొంది. టాస్‌ సమయంలో వికెట్‌ పొడిగా ఉండడంతో లంక కెప్టెన్‌ డసున్‌ షనక మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ తీసుకొన్నాడు. రోహిత్‌ కూడా తొలుత బ్యాటింగ్‌ చేస్తాననే అన్నాడు. అయితే, ఆ తర్వాత వర్షం కురవడంతో.. 40 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ ఆరంభమైంది. ఈ మధ్యలో అందరి అంచనాలు తారుమారయ్యాయి. బంతి అనూహ్యంగా స్వింగ్‌ కావడంతో భారత పేసర్లు చెలరేగిపోయారు. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (0)ను బుమ్రా క్యాచ్‌ అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. రెండో ఓవర్‌ను సిరాజ్‌ మేడిన్‌ వేయగా.. తర్వాతి ఓవర్‌లో బుమ్రా సింగిల్‌ ఇచ్చాడు. అయితే, అసలు డ్రామా నాలుగో ఓవర్‌లో ఆరంభమైంది. సిరాజ్‌ తొలి బంతిని ఆఫ్‌ స్టంప్‌ బయట వేయగా.. నిస్సాంక సింగిల్‌ తీయాలనే ఉద్దేశంతో పుష్‌ చేయగా.. బంతి గాల్లోకి లేవడంతో జడేజా డైవ్‌ చేస్తూ చక్కని క్యాచ్‌ అందుకొన్నాడు. రెండో బంతిని వదిలేసిన సమరవిక్రమ (0).. ఆ తర్వాతి బంతికి ఎల్బీ అయ్యాడు. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన అసలంక (0)ను క్యాచవుట్‌ చేసి సిరాజ్‌ హ్యాట్రిక్‌పై నిలిచాడు. కానీ, ఐదో బంతికి ఫోర్‌ కొట్టిన ధనంజయ డిసిల్వ (4).. ఆఖరి బంతికి కీపర్‌కు చిక్కాడు. దీంతో లంక 12/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత షనక (0)ను అద్భుతమైన అవుట్‌ స్వింగర్‌తో బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. 12వ ఓవర్‌లో మరో ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ను బౌల్డ్‌ చేసి సిరాజ్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వెల్లలగే (8), ప్రమోద్‌ మదుషన్‌ (1), పథిరన (0)ను అవుట్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా.. 50 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

ఓపెనర్లే కొట్టేశారు: స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించింది. గిల్‌కు జతగా ఇషాన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ ఫోర్‌తో ఖాతా తెరవగా.. రెండో ఓవర్‌లో ఇషాన్‌ రెండు బౌండ్రీలతో బ్యాట్‌కు పని చెప్పాడు. ప్రమోద్‌ వేసిన మూడో ఓవర్‌లో ఇషాన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో 15 పరుగులు పిండుకోవడంతో భారత్‌ 32/0తో నిలిచింది. గిల్‌ బౌండ్రీతో స్కోరు సమం కాగా.. ఇషాన్‌ సింగిల్‌తో జట్టుకు భారీ గెలుపును అందించాడు.

8.jpg


ఆసియా కప్‌లో శ్రీలంక ట్రాక్‌ రికార్డు పరిశీలిస్తే..భారత్‌తో ఆదివారంనాటి ఫైనల్‌ మరీ ఇంత పేలవంగా ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందునా ఈసారి స్వదేశంలో జరగడంతో ఫైనల్‌ ముందు వరకు లంకేయులు కసితీరా ఆడారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో లంక చూపిన పోరాటంతో టైటిల్‌ ఫైట్‌ ఉత్కంఠగా సాగడం ఖాయమనే అనిపించింది. ఇంకా సూపర్‌-4 మ్యాచ్‌లో పరాజయంపాలైనా లంక మనోళ్లకు ఎలా గాభరా పుట్టించిందో చూశాం. ఈ నేపథ్యంలో తుదిపోరును మస్తు ఎంజాయ్‌ చేయొచ్చని రెండు జట్ల ఫ్యాన్స్‌ ఆశపడ్డారు. కానీ మ్యాచ్‌ మొత్తం 22 ఓవర్లలోపే ముగియడంతో నిరాశ చెందారు. వాస్తవంగా ఈసారి ఆసియా కప్‌ మ్యాచ్‌లన్నీ టర్నింగ్‌ వికెట్లపైనే జరిగాయి. ఫైనల్‌కు సైతం అలాంటి వికెట్టే ఉంటుందని, అటు వెల్లలగే, ఇటు కుల్దీప్‌ యాదవ్‌ తిప్పేస్తారని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. వర్షం.. దట్టంగా మబ్బులు కమ్మిన వాతావరణం..ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న హైదరాబాద్‌ యువ పేసర్‌ సిరాజ్‌ సంచలనం సృష్టించాడు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి చల్లటి వాతావరణంలోనూ లంకేయులకు చెమటలు పట్టించాడు. ఆసియా కప్‌ ఫైనల్లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలతో రికార్డులకెక్కాడు. ఈ అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కొద్దిరోజుల్లో స్వదేశంలో జరిగే వరల్డ్‌ కప్‌నకు సిరాజ్‌ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగేందుకు తోడ్పడుతుంది. ప్రపంచ కప్‌నకు ముందు ఆసియా కప్‌ టీమిండియాకు ఎంతో కీలకమైంది. కారణం..వరల్డ్‌ కప్‌ జట్టులో ఉన్న కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, శ్రేయాస్‌ గాయాలతో చాలాకాలం జట్టుకు దూరంగా ఉండి ఈ టోర్నీ ద్వారా పునరాగమనం చేశారు. మెగా టోర్నీకి ముందు వీరి ఫామ్‌ను పరిశీలించేందుకు ఆసియా కప్‌ వేదికగా నిలిచింది. దీంతో రాహుల్‌, బుమ్రా సత్తా చాటడం భారత్‌కు ఊరటనిచ్చింది. శ్రేయాస్‌ మళ్లీ వెన్నునొప్పికి గురవడం ఒకింత ఆందోళన కలిగిస్తున్నా..వరల్డ్‌ కప్‌నకు రెండు వారాలకుపైగా సమయం ఉండడంతో అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే చాన్సుంది. ఏమైనా మెగా టోర్నీకి ముందు ఆసియా కప్‌ నెగ్గడం టీమిండియాకు బలమైన టానిక్‌లా పని చేస్తుందనడంలో సందేహం లేదు.

మిగిలిన ఉన్న బంతుల పరంగా వన్డే టోర్నీ ఫైనల్లో భారీ విజయం సాధించిన జట్టుగా భారత్‌ (263 బంతులు). 2003లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 226 బంతులు, 1999లో పాకిస్థాన్‌పై ఆసీస్‌ 179 బంతులు మిగిలుండగానే గెలిచాయి. ఓవరాల్‌గా తక్కువ బంతుల్లో (129) ముగిసిన మ్యాచ్‌కూడా ఇదే.

శ్రీలంక: నిస్సాంక (సి) జడేజా (బి) సిరాజ్‌ 2, కుశాల్‌ పెరీరా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 0, కుశాల్‌ మెండిస్‌ (బి) సిరాజ్‌ 17, సమరవిక్రమ (ఎల్బీ) సిరాజ్‌ 0, అసలంక (సి) ఇషాన్‌ (బి) సిరాజ్‌ 0, ధనంజయ డిసిల్వ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4, షనక (బి) సిరాజ్‌ 0, వెల్లలగే (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 8, హేమంత (నాటౌట్‌) 13, ప్రమోద్‌ (సి) కోహ్లీ (బి) హార్దిక్‌ 1, పథిరన (సి) ఇషాన్‌ (బి) హార్దిక్‌ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 15.2 ఓవర్లలో 50 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-8, 3-8, 4-8, 5-12, 6-12, 7-33, 8-40, 9-50, 10-50; బౌలింగ్‌: బుమ్రా 5-1-23-1, సిరాజ్‌ 7-1-21-6, హార్దిక్‌ పాండ్యా 2.2-0-3-3, కుల్దీప్‌ యాదవ్‌ 1-0-1-0.

భారత్‌: ఇషాన్‌ (నాటౌట్‌) 23, గిల్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు:1; మొత్తం: 6.1 ఓవర్లలో 51/0; బౌలింగ్‌: ప్రమోద్‌ 2-0-21-0, పథిరన 2-0-21-0, వెల్లలగే 2-0-7-0, అసలంక 0.1-0-1-0.

Updated Date - 2023-09-18T04:22:19+05:30 IST