GT vs DC : గుజరాత్‌.. అదే జోరు

ABN , First Publish Date - 2023-04-05T01:50:49+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 నాటౌట్‌) ..

GT vs DC : గుజరాత్‌.. అదే జోరు

వరుసగా రెండో విజయం

6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి

సాయి సుదర్శన్‌ హాఫ్‌ సెంచరీ

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ జోరు కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 నాటౌట్‌) నిలకడైన ఆటకు, డేవిడ్‌ మిల్లర్‌ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్‌) మెరుపులు తోడవడంతో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. అటు డీసీకిది రెండో వరుస ఓటమి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. వార్నర్‌ (37), అక్షర్‌ (36), సర్ఫరాజ్‌ (30) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. నోకియాకు రెండు వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా సాయి సుదర్శన్‌ నిలిచాడు.

సుదర్శన్‌ నిలకడ: ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ పరిణతితో కూడిన బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా తను జట్టును విజయం వైపు నడిపించాడు. అంతకుముందు జట్టు ఛేదన మెరుపు వేగంతో ఆరంభమైంది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ సాహా (14) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు. ఇక రెండో ఓవర్‌లో గిల్‌ (14) రెండు ఫోర్లతో మెరిశాడు. కానీ ఈ జోడీని పేసర్‌ నోకియా వరుస ఓవర్లలో అవుట్‌ చేసి దెబ్బతీశాడు. ఇక కెప్టెన్‌ పాండ్యా (5)ను ఖలీల్‌ అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 54/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో విజయ్‌ శంకర్‌తో కలిసి సాయి సుదర్శన్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. స్ట్రయిక్‌ను రొటేట్‌ చేసుకుంటూ ఈ తమిళనాడు ద్వయం స్కోరును పెంచారు. అలాగే భారీ షాట్లకు వెళ్లకుండా సింగిల్స్‌పై దృష్టి సారిస్తూ వికెట్‌ కాపాడుకున్నారు. అయితే నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం తర్వాత విజయ్‌శంకర్‌ను మార్ష్‌ ఎల్బీ చేశాడు. కానీ మిల్లర్‌ రాకతో స్కోరులో వేగం పెరిగింది. 16వ ఓవర్‌లో 6,6,4తో 20 రన్స్‌ రాబట్టగా.. తర్వాతి ఓవర్‌లో సుదర్శన్‌ 4,6తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో మరో 11 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.

పేసర్ల జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో వార్నర్‌ మినహా టాపార్డర్‌ మరోసారి విఫలమైంది. వికెట్‌పై లభించిన పేస్‌తో పాటు బౌన్స్‌ను వినియోగించుకుంటూ పేసర్లు షమి, జోసెఫ్‌ చెలరేగారు. ముఖ్యంగా జోసెఫ్‌ బౌన్సర్లను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు తంటాలు పడ్డారు. అటు మధ్య ఓవర్లలో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉచ్చు బిగించాడు. ఆరంభంలోనే వరుస ఓవర్లలో ఓపెనర్‌ పృథ్వీ షా (7), మిచెల్‌ మార్ష్‌ (4)ను షమి అవుట్‌ చేయగా.. తొమ్మిదో ఓవర్‌లో అల్జారి జోసెఫ్‌ డబుల్‌ షాక్‌ ఇచ్చాడు. చక్కగా కుదురుకున్న వార్నర్‌, రోసో (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. హ్యాట్రిక్‌ కూడా లభించేదే కానీ అభిషేక్‌ పోరెల్‌ (20) ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను కీపర్‌ సాహా వదిలేశాడు. ఈ చాన్స్‌ను అరంగేట్ర కీపర్‌ పోరెల్‌ సద్వినియోగం చేసుకున్నాడు. డేరింగ్‌ షాట్లతో ఆకట్టుకుంటూ రెండు సిక్సర్లతో మెరిశాడు. కానీ 13వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్‌ రషీద్‌ చేతిలో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సర్ఫరాజ్‌తో కలిసి తను ఐదో వికెట్‌కు 34 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఓపిగ్గా ఆడిన సర్ఫరాజ్‌, అమన్‌ (8)లను సైతం రషీదే అవుట్‌ చేశాడు. మరో ఎండ్‌లో అక్షర్‌ బాధ్యత తీసుకుని 2 ఫోర్లు, 3 సిక్సర్లతో వేగం కనబర్చాడు. చివరి ఓవర్‌లో షమి అతడిని అవుట్‌ చేసినా అప్పటికే జట్టు పోరాడే స్కోరు సాధించింది.

స్టేడియంలో రిషభ్‌ పంత్‌

కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు. సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ఫ్రాంచైజీ యజమానులు కూర్చునే బాక్స్‌ నుంచి వీక్షించాడు. తెల్లటి టీషర్ట్‌, జీన్స్‌తో పాటు కళ్లద్దాలు ధరించిన పంత్‌ ఇంకా కాలికి పట్టీ, చేతి కర్ర సహాయంతోనే నడవడం కనిపించింది. అలాగే స్టేడియంలో బిగ్‌స్ర్కీన్‌పై అతను కనిపించగానే ప్రేక్షకులు సందడి చేశారు.

స్కోరుబోర్డు

ఢిల్లీ: వార్నర్‌ (బి) జోసెఫ్‌ 37, పృథ్వీ షా (సి) జోసెఫ్‌ (బి) షమి 7, మార్ష్‌ (బి) షమి 4, సర్ఫరాజ్‌ (సి) లిటిల్‌ (బి) రషీద్‌ 30, రొసో (సి) తెవాటియా (బి) జోసెఫ్‌ 0, పోరెల్‌ (బి) రషీద్‌ 20, అక్షర్‌ పటేల్‌ (సి) మిల్లర్‌ (బి) షమి 36, అమన్‌ ఖాన్‌ (సి) హార్దిక్‌ (బి) రషీద్‌ 8, కుల్దీప్‌ (నాటౌట్‌) 1, నోకియా (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు 15, మొత్తం: 20 ఓవర్లలో 162/8, వికెట్ల పతనం: 1-29, 2-37, 3-67, 4-67, 5-101, 6-130, 7-148, 8-158; బౌలింగ్‌: షమి 4-0-41-3, లిటిల్‌ 4-0-27-0, హార్దిక్‌ 3-0-18-0, జోసెఫ్‌ 4-0-29-2, యశ్‌ దయాళ్‌ 1-0-12-0, రషీద్‌ 4-0-31-3.

గుజరాత్‌: సాహా (బి) నోకియా 14, గిల్‌ (బి) నోకియా 14, సుదర్శన్‌ (నాటౌట్‌) 62, హార్దిక్‌ (సి) పోరెల్‌ (బి) ఖలీల్‌ 5, విజయ్‌ శంకర్‌ (ఎల్బీ) మార్ష్‌ 29, మిల్లర్‌ (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు 8. మొత్తం: 18.1 ఓవర్లలో 163/4; వికెట్లపతనం:1-22, 2-36, 3-54, 4-107; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-38-1, ముఖేష్‌ 4-0-42-0, నోకియా 4-0-39-2, మార్ష్‌ 3.1-0-24-1, కుల్దీప్‌ 3-0-18-0.

Updated Date - 2023-04-05T01:50:49+05:30 IST