Share News

Virat Kohli - Shreyas Iyer: కోహ్లీకి, శ్రేయస్‌కు కలిసిరాని కాలం.. ఇది నిజంగా దురదృష్టకరం

ABN , First Publish Date - 2023-11-19T17:34:55+05:30 IST

వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీ ఫైనల్ వరకూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా రాణించారో అందరికీ తెలుసు. భారత్ సాధించిన అద్భుత విజయాల్లో వీళ్లు ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి.. భారత్ మిడిలార్డర్‌కు..

Virat Kohli - Shreyas Iyer: కోహ్లీకి, శ్రేయస్‌కు కలిసిరాని కాలం.. ఇది నిజంగా దురదృష్టకరం

వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీ ఫైనల్ వరకూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా రాణించారో అందరికీ తెలుసు. భారత్ సాధించిన అద్భుత విజయాల్లో వీళ్లు ప్రధాన పాత్ర పోషించారు. ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి.. భారత్ మిడిలార్డర్‌కు వెన్నుముకగా నిలిచారు. వీలు చిక్కినప్పుడల్లా సెంచరీల మోత కూడా మోగించారు. ఇది చూసి.. ఫైనల్ మ్యాచ్‌లోనూ వీళ్లిద్దరు ఇదే ఆటతీరు కనబరుస్తారని, కీలకమైన ఇన్నింగ్స్‌లతో రాణిస్తారని భావించారు. కానీ.. దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఫైనల్‌లో వీరి ఆటతీరు నిరాశపరిచింది.


అఫ్‌కోర్స్.. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 63 బంతుల్లో 54 పరుగులు చేసి, తనవంతు జట్టుకి సహకారం అందించాడు. కానీ.. భారతీయ అభిమానులు అతని నుంచి అంతకుమించి మెరుగైన ఆటని ఆశించారు. కోహ్లీ కూడా బాగానే రాణించాలని అనుకున్నాడు. జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి.. వికెట్‌ని కాపాడుకుంటూ నిదానంగా ఆడాలని భావించాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతడు అనుకోకుండా ఔట్ అయ్యాడు. పాట్ కమిన్స్ వేసిన 29వ ఓవర్‌లో అతడు షార్ట్ బంతిని థర్డ్ మ్యాన్ వైపు సింగిల్ ఆడాలని ప్రయత్నించాడు కానీ, అది బ్యాట్‌కి తగిలి వికెట్లను తాకింది. కోహ్లీ ఈ రకంగా ఔట్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. స్వయంగా కోహ్లీ కూడా ఊహించి ఉండడు. ఇది నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి.

అంతకుముందు శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా అంతే! వచ్చి రాగానే ఫోర్‌తో చెలరేగిన అతగాడు.. ఆ తర్వాత నిదానంగా వచ్చిన బంతిని ఏమాత్రం పసిగట్టలేకపోయాడు. పాట్ కమిన్స్ చాలా తెలివిగా స్లోగా, తక్కువ ఎత్తులో బంతిని వేయడంతో.. శ్రేయస్‌కి ఎలా ఆడాలో అర్థం కాలేదు. దాన్ని అడ్డుకోవాలని ట్రై చేశాడు కానీ.. అది అనూహ్యంగా బ్యాట్‌కి తగిలి, కీపర్‌ చేతిలో క్యాచ్‌గా వెళ్లింది. ఇలా కోహ్లీ, శ్రేయస్ దురదృష్టవశాత్తూ ఔట్ అవ్వడం జట్టుకి శాపంగా మారింది. బహుశా వీళ్లు క్రీజులో కాసేపైనా నిల్చొని ఉండుంటే.. భారత్ స్కోరు మరో లెవెల్‌లో ఉండేదని చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-11-19T17:34:56+05:30 IST