Share News

IND vs AUS: 2003 సీన్ మళ్లీ రిపీట్.. టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!

ABN , First Publish Date - 2023-11-19T21:39:17+05:30 IST

2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? అప్పుడు కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్యే మ్యాచ్ జరిగింది. ఆ ఫైనల్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు...

IND vs AUS: 2003 సీన్ మళ్లీ రిపీట్.. టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!

2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? అప్పుడు కూడా భారత్, ఆస్ట్రేలియా మధ్యే మ్యాచ్ జరిగింది. ఆ ఫైనల్‌లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు. టీమిండియా బ్యాటర్లు సైతం ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క సెహ్వాగ్ (84) మినహాయిస్తే ఎవ్వరూ రాణించలేకపోయారు. అందుకే.. ఆ ఫైనల్‌లో ఇండియా ఓటమిపాలైంది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. రెండింటిలోనూ ఇండియా విఫలం కావడంతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

భారత్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం.. బ్యాటర్లు సరైన ప్రదర్శన కనబర్చకపోవడమే. రోహిత్ శర్మ ఆటతీరు అగ్రెసివ్ అయినప్పటికీ.. ఇలాంటి కీలక మ్యాచ్‌లో మాత్రం ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది. అసలే పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలించదని ముందు నుంచే చెప్తున్నారు కాబట్టి, రోహిత్ ఇంకాసేపు క్రీజులో ఉండేలా జాగ్రత్తగా ఆడి ఉంటే బాగుండేది. శుభ్‌మన్ గిల్ అయితే అనవసరమైన షాట్ ఆడి ఔట్ అయ్యాడు. అసలు అతనికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు కానీ, తన స్థాయి ఆటతీరు మాత్రం అతడు కనబర్చలేకపోయాడు. అతడు ఔట్ అయిన విధానమే అందుకు సాక్ష్యం.


ఇక శ్రేయస్ అయ్యార్ కూడా.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లీగ్ దశలో అంత బాగా ఆడిన ప్లేయర్, కీలక మ్యాచ్‌లో 4 పరుగులకే ఔట్ అవ్వడం బ్యాడ్ లక్. ఇక కేఎల్ రాహుల్ అయితే.. టెస్టు తరహాలో ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్‌కోర్స్.. వికెట్లు లేనప్పుడు ఆచితూచి ఆడాలి. కానీ.. పూర్తిగా డిఫెన్స్ ఆడటం మైనస్‌గా మారింది. అతడు 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇక జడేజా, సూర్యకుమార్ అయితే పూర్తిగా చేతులెత్తేశారు. ఈ టోర్నీలో వీళ్లు ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్, రాహుల్ పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లు జెండా ఎత్తేయడం ఈ ఓటమికి కారణం.

ఇక రెండో ప్రధాన కారణం.. పేలవమైన బౌలింగ్ ప్రదర్శన. సెమీ ఫైనల్ దాకా ఎగబడి మరీ వికెట్లు తీసిన మన భారత బౌలర్లు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం టోటల్‌గా చేతులెత్తేశారు. మొదట్లో బుమ్రా (2), షమీ (1) కలిసి మూడు వికెట్లు తీసి మంచి జోష్ తీసుకొచ్చారు కానీ.. ఆ తర్వాత నుంచి ఏం చేయలేకపోయారు. మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్‌ల భాగస్వామ్యాన్ని ఏమాత్రం బ్రేక్ చేయలేకపోయారు. కఠినమైన పిచ్‌లలోనూ మెరుగైన ఆటతీరు ఎలా కనబర్చాలో.. వీళ్లిద్దరు చాటి చెప్పారు. మన బ్యాటర్లు పరుగులు చేసేందుకు తడబడితే.. వీళ్లిద్దరు మాత్రం పరుగుల వర్షం కురిపించి, తమ జట్టుని సునాయాసంగా గెలిపించుకున్నారు.

Updated Date - 2023-11-19T21:39:19+05:30 IST