IPL 2023: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ.. ఇంగ్లండ్ క్రికెటర్లకు కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. వారెవరు?

ABN , First Publish Date - 2023-04-27T16:38:57+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్‌ (IPL)లో ఆడాలని కోరుకోని వారు ఉండరంటే

IPL 2023: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ.. ఇంగ్లండ్ క్రికెటర్లకు కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. వారెవరు?

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్‌ (IPL)లో ఆడాలని కోరుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచంలోని ఏ మూల ఉన్న క్రికెటర్ అయినా ఐపీఎల్‌లో ఒకసారి అయినా ఆడాలని కోరుకుంటాడు. తాజాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌ (England) స్టార్ క్రికెటర్లు ఆరుగురిని కలిసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంతర్జాతీయ క్రికెట్‌ను వదిలేసి వస్తే కోట్లు కుమ్మరిస్తామని ఆఫర్ ఇచ్చినట్టు ‘టైమ్స్ లండన్’ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి ఏడాదంతా ఫ్రాంచైజీకి ఆడేందుకు యాజమాన్యాలు వారిని ఒప్పించే ప్రయత్నం చేశాయని, అందుకు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు ఆ కథనం పేర్కొంది. 5 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 50 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ప్రస్తుతం ఉన్న 10 ఫ్రాంచైజీలు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టిసారించిన నేపథ్యంలో తాజా కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికాలోని ది ఎస్ఏ టీ20 లీగ్, యూఏఈలోని ఐఎల్‌టీ20 లీగ్, అమెరికాలో త్వరలో రాబోతున్న మేజర్ క్రికెట్ లీగ్ వంటి వాటిపై ఇవన్నీ మనసు పారేసుకోవడమే కాకుండా కొన్నింటిలో పెట్టుబడులు కూడా పెట్టాయి.

అయితే, టాప్ ఇంగ్లండ్ క్రికెటర్లను సంప్రదించిన ఫ్రాంచైజీ ఏదన్నది మాత్రం ‘టైమ్స్ లండన్’ వెల్లడించలేదు. అంతేకాదు, ఈ చర్చల్లో ఏ క్రికెటర్ పాల్గొన్నాడన్న విషయాన్ని కూడా బయటపెట్టలేదు. ఇక, ప్రపంచంలోనే ‘రిచ్చెస్ట్ టీ20 లీగ్’ను ప్రారంభించాలని సౌదీ అరేబియా యోచిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపైన కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-04-27T16:43:42+05:30 IST