IPL 2023: తగ్గేదేలే.. ఈసారి కూడా భారీ స్కోరు చేసిన చెన్నై!

ABN , First Publish Date - 2023-04-03T21:45:06+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో జరుగుతున్న ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో ధోనీ(MS Dhoni) సారథ్యంలోని

IPL 2023: తగ్గేదేలే.. ఈసారి కూడా భారీ స్కోరు చేసిన చెన్నై!

చెన్నై: లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో జరుగుతున్న ఐపీఎల్ 6వ మ్యాచ్‌లో ధోనీ(MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK)బ్యాటింగులో మరోమారు చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి కొండంత లక్ష్యాన్నినిర్దేశించింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బ్యాట్‌తో విరుచుకుపడిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లను భయపెట్టాడు. యథేచ్ఛగా ఫోర్లు, సిక్సర్లు బాదుతో వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. గత మ్యాచ్‌లో 92 పరుగులు చేసిన గైక్వాడ్ ఈసారి మాత్రం అర్ధ సెంచరీ అయిన కాసేపటికే అవుటయ్యాడు. 31 బంతులు ఆడి 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగులో మార్క్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

మరోవైపు, గత మ్యాచ్‌లో సింగిల్ పరుగుకే పరిమితమైన డెవోన్ కాన్వే (Devon Conway) ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. బంతులను ఇష్టం వచ్చినట్టు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే, ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అర్ధ సెంచరీ ముందు అవుటయ్యాడు. గైక్వాడ్-రుతురాజ్ కలిసి తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

శివం దూబే కూడా క్రీజులో ఉన్న కొన్ని నిమిషాలు బౌలర్లను ఆడుకున్నాడు. 16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసి స్కోరు నెమ్మదించకుండా చూశాడు. మొయిన్ అలీ 19, అంబటి రాయుడు 27(నాటౌట్) పరుగులు చేయగా, చివర్లో వచ్చిన ధోనీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి స్కోరు బోర్డును 200 పరుగుల మైలురాయిని దాటించాడు. మూడో బంతిని కూడా బలంగా బాదినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రవి బిష్ణోయ్ క్యాచ్ అందుకుని ధోనీని పెవిలియన్ పంపాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-03T22:01:00+05:30 IST