IPL 2023: కుమ్మేసిన రాజస్థాన్.. సొంత మైదానంలో హైదరాబాద్‌‌కు ఘోర పరాభవం!

ABN , First Publish Date - 2023-04-02T19:43:59+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన ఐపీఎల్ 4వ మ్యాచ్‌లో

IPL 2023: కుమ్మేసిన రాజస్థాన్.. సొంత మైదానంలో హైదరాబాద్‌‌కు ఘోర పరాభవం!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరిగిన ఐపీఎల్ 4వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌ను సొంత మైదానంలో మట్టికరిపించి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. రాజస్థాన్ నిర్దేశించిన 204 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కొండంత లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్‌(SRH)కు ఆరంభంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖాతా కూడా తెరవకుండానే అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వికెట్లను కోల్పోయింది. వీరిద్దరినీ ట్రెంట్ బౌల్ట్ అవుట్ చేశాడు. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆరంభంలో బౌల్ట్ హైదరాబాద్‌ను దెబ్బ కొడితే ఆ తర్వాత చాహల్ విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టి చావు దెబ్బ తీశాడు. దీంతో హైదరాబాద్ పరాజయం ఖాయమైంది. అబ్దుల్ సమద్ చేసిన 32 (నాటౌట్) పరుగులకే జట్టులో అత్యధికమంటే హైదరాబాద్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మయాంక్ అగర్వాల్ 27, అదిల్ రషీద్ 18, ఉమ్రాన్ మాలిక్ 19 పరుగులు చేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులోని తొలి ముగ్గురు బ్యాటర్లు.. యశస్వి జైస్వాల్ (54), జోస్ బట్లర్ (54), సంజు శాంసన్ (55) అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. హెట్మెయిర్ 22 పరుగులు చేశాడు.

Updated Date - 2023-04-02T19:43:59+05:30 IST