IND vs NZ: బ్రేస్‌వెల్ ముచ్చెమటలు పట్టించినా మనమే గెలిచాం.. తొలి వన్డేలో ఓడిన కివీస్

ABN , First Publish Date - 2023-01-18T22:14:51+05:30 IST

ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో...

IND vs NZ: బ్రేస్‌వెల్ ముచ్చెమటలు పట్టించినా మనమే గెలిచాం.. తొలి వన్డేలో ఓడిన కివీస్

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగులు సాధించి 350 పరుగుల టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. 70 పరుగులకే ఓపెనర్లు కాన్వే (10), అలెన్ (40) ఇద్దరి వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత హెన్రీ నికోలస్ (18), మిచెల్ (9), కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (24), గ్లెన్ ఫిలిప్స్ (11) పరుగులకే ఔట్ కావడంతో కివీస్ 131 పరుగులకే ఆరు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్, శాంట్నర్ పిల్లర్ల మాదిరిగా నిలబడ్డారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన బీభత్సం అంతాఇంతా కాదు.

గెలుపుపై ఆశలు వదిలేసుకున్న కివీస్ అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు. బ్రేస్‌వెల్, శాంట్నర్ కలిసి 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శాంట్నర్ 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్‌గా చిక్కడంతో పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. ఆ తర్వాత కూడా బ్రేస్‌వెల్ దూకుడుగానే ఆడాడు. సిక్సులతో చెలరేగాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీతో రాణించి 140 పరుగులు చేసి ఔట్ అయ్యాడంటే టీమిండియా బౌలర్లపై ఏరేంజ్‌లో విరుచుకుపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 బంతుల్లో 13 పరుగులు కొడితే న్యూజిలాండ్ విన్ అయ్యే పరిస్థితులున్నప్పుడు బ్రేస్‌వెల్ ఎల్బీగా ఔట్ కావడంతో కివీస్ 337 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు విజయం దక్కింది.

బ్రేస్‌వెల్ సెంచరీ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో గిల్ డబుల్ సెంచరీ ఎక్కడ వృథా అవుతుందోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందారు. సిరాజ్ 10 ఓవర్లలో 46 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. టీమిండియా బ్యాటింగ్‌లో గిల్ డబుల్ సెంచరీ ఎంత కీలకమో, బౌలింగ్‌లో ఈ హైదరాబాద్ కుర్రాడి పాత్ర కూడా అంతే కీలకమని చెప్పొచ్చు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో రాణించగా, కుల్దీప్ యాదవ్‌కు 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు, షమీకి ఒక వికెట్ దక్కింది.

Updated Date - 2023-01-18T23:11:13+05:30 IST