Rinku Singh: కొట్టిన ప్రతి సిక్సర్ వారికే అంకితం: రింకు సింగ్

ABN , First Publish Date - 2023-04-10T18:13:20+05:30 IST

ఐదు సిక్సర్లు బాదిన రింకు సింగ్ జట్టుకు నమ్మశక్యం కాని రీతిలో విజయాన్ని అందించిపెట్టాడు. భయంకరమైన

Rinku Singh: కొట్టిన ప్రతి సిక్సర్ వారికే అంకితం: రింకు సింగ్

న్యూఢిల్లీ: ఐపీఎల్(IPL 2023) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) జట్టు ఆటగాడు రింకు సింగ్(Rinku Singh) ఇప్పుడు టాక్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రింకు సింగ్ జట్టుకు నమ్మశక్యం కాని రీతిలో విజయాన్ని అందించిపెట్టాడు. భయంకరమైన ఆటతీరుతో గుజరాత్ బౌలర్ యశ్ దయాళ్(Yash Dayal) బంతులను చాకిరేవు పెట్టిన రింకు సింగ్.. మొత్తంగా 21 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి బ్యాటింగ్‌ ముందు గుజరాత్ తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్(Rashid Khan) తీసిన సంచలన హ్యాట్రిక్ చిన్నబోయింది.

మ్యాచ్ అనంతరం రింకు సింగ్ మాట్లాడుతూ.. తానో రైతు కుటుంబం నుంచి వచ్చానని, తమ కోసం తన తండ్రి ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేసుకున్నాడు. తాను కొట్టిన ప్రతి సిక్సర్‌ను తన కోసం త్యాగాలు చేసిన వారికి అంకితమిస్తున్నట్టు చెప్పాడు. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వద్ద రాటుదేలిన రింకు సింగ్ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. రంజీ ట్రోఫీలోనూ చక్కని ప్రతిభ కనబరిచాడు.

తన మీద తనకు నమ్మకం ఉందని, గత సీజన్‌లో లక్నోతో ఆడినప్పటి పరిస్థితే గుజరాత్ మ్యాచ్‌లోనూ ఉందని రింకు చెప్పుకొచ్చాడు. ఆ షాట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినవేనని అన్నాడు. అయితే, చివరి సిక్సర్ కొట్టేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చిందన్నాడు. విజయానికి అవసరమైన సిక్సర్‌ను బ్యాక్‌ఫుట్‌పై ఆడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.

రింకు ఆటతీరుపై కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాట్లాడుతూ.. గత సీజన్‌లో ఆడినట్టుగానే ఇప్పుడు కూడా రింకు ఆడాడని గుర్తు చేసుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో తాము గెలవలేకపోయామన్నాడు. రెండో సిక్సర్ కొట్టాక తమకు నమ్మకం వచ్చిందన్నాడు.

Updated Date - 2023-04-10T18:13:20+05:30 IST