Disney’s Hotstar: మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయిన సేవలు.. డిస్నీ హాట్‌స్టార్‌పై పెల్లుబికిన ఆగ్రహం!

ABN , First Publish Date - 2023-02-17T21:16:47+05:30 IST

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)ని

Disney’s Hotstar: మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయిన సేవలు.. డిస్నీ హాట్‌స్టార్‌పై పెల్లుబికిన ఆగ్రహం!

న్యూఢిల్లీ: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)ని ప్రసారం చేస్తున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) యూజర్లకు షాకిచ్చింది. మ్యాచ్‌ను వీక్షిద్దామని యాప్‌ను ఓపెన్ చేస్తే అది కాస్తా మొరాయించింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సమస్య మన దగ్గర కాదని అర్థమైన యూజర్లు సోషల్ మీడియా వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రర్ కోడ్ రావడం, ఎంతసేపటికీ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మండిపోయిన యూజర్లు ట్విట్టర్‌లోకి దిగి దుమ్మెత్తి పోశారు.

యాప్ పనిచేయడం లేదంటూ పోస్టులు, కామెంట్లు, మీమ్‌లతో ట్విట్టర్‌ను ముంచెత్తారు. మరికొందరు స్క్రీన్‌షాట్లను కూడా షేర్ చేశారు. యూజర్ల నుంచి వస్తున్న విమర్శలతో ఎట్టకేలకు స్పందించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సాంకేతిక సమస్య కారణంగానే సేవల్లో అంతరాయం ఎదురైనట్టు ముక్తసరిగా వివరణ ఇచ్చింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్, జైపూర్, ముంబై ప్రాంతాల యూజర్లును సేవల అంతరాయం బాగా వేధించింది. తామైతే దాదాపు 45 నిమిషాలపాటు ఈ సమస్యను ఎదుర్కొన్నట్టు మరికొందరు పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు ‘డౌన్ డిక్టేటర్’ కూడా నిర్ధారించింది. కాగా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయింది. అలాగే, హెచ్‌బీవో షోల స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-02-17T21:16:48+05:30 IST