Cheteshwar Pujara: అరుదైన ఘనతకు అడుగు దూరంలో చతేశ్వర్ పుజారా!

ABN , First Publish Date - 2023-02-14T17:18:36+05:30 IST

టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత

Cheteshwar Pujara: అరుదైన ఘనతకు అడుగు దూరంలో చతేశ్వర్ పుజారా!

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అరుదైన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా ఈ నెల 17న ఢిల్లీలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో మైదానంలోకి అడుగుపెట్టడంతోనే ఇండియన్ క్రికెటర్ల ఎలైట్ లిస్టులో చోటు సంపాదించుకుంటాడు. ఇది అతడికి 100వ టెస్టు. ఫలితంగా వంద టెస్టులు ఆడిన 13వ భారతీయ ఆటగాడిగా ఎలైట్ జాబితాలోకి ఎక్కుతాడు. అంతేకాదు, ప్రస్తుత భారత జట్టులో ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌ అవుతాడు. గతేడాది మార్చిలో మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టులో కోహ్లీ(Virat Kohli) వందో టెస్టు ఆడేశాడు. ఇప్పుడు పుజారా ఆ ఘనత అందుకోనున్నాడు.

బెంగళూరులో 2010లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్‌లో పుజారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాపైనే వందో టెస్టు ఆడబోతున్నాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారాకు ప్రమోషన్ వచ్చింది. నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగి 72 పరుగులు చేశాడు. పుజారా చలువతో 207 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన టీమిండియా సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది

ఆ తర్వాత ఆస్ట్రేలియాపై మరో 20 టెస్టులు ఆడాడు. ఆసీస్‌పై 21 మ్యాచ్‌లు ఆడిన పుజారా 52.77 సగటులో 1900 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018-19లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు పుజారా అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సిరీస్‌లో విజయం సాధించిన భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డులకెక్కింది.

ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన పుజారా 44.15 సగటుతో 7,021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన పుజారా పలుమార్లు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. గతేడాది బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన టెస్టులో వేగవంతమైన టెస్టు సెంచరీ చేశాడు.

దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలుత 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్ ఆ తర్వాత దారుణ ఆటతీరుతో సిరీస్‌ను కోల్పోయింది. అనంతరం పుజారా, అజింక్య రహానేపై వేటుపడింది. ఆ తర్వాత రహానేకు జట్టులో చోటు దక్కనప్పటికీ బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌(England)తో జరిగిన రీషెడ్యూల్ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చి రాణించాడు. ఆ తర్వాతి నుంచి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. బర్మింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన పుజారా ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో వరుసగా 90, 102 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ నాగ్‌పూర్ టెస్టులో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పుజారా కీలకంగా మారాడు.

Updated Date - 2023-02-14T17:18:39+05:30 IST