Viral News: అమ్మ కళ్లలో ఆనందం కోసం 17 ఏళ్ల టీనేజర్ చేసిన పనేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-06-07T20:28:27+05:30 IST
అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. తల్లిని మించిన దైవం లోకంలో లేదనేది వాస్తవం. అలాంటి తల్లికి కనీసం తిండి పెట్టని రోజులివి. కానీ పాఠశాల దశలో ఉన్న ఓ పిల్లాడు తల్లికోసం చేసిన పని చూస్తే.. హృదయం ద్రవించక మానదు. చిన్న వయసులోనే తల్లి కోరిక తీర్చిన ‘ది సక్సెస్ ఫుల్ గేమింగ్ సర్వర్ డెవలపింగ్ బోయ్ స్టోరీ’’ ఏంటో తెలుసుకుందాం...
అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. అమ్మ ప్రేమ ఎంతో గొప్పది. అంతేకాదు.. ప్రతి వ్యక్తికి తొలి గురువు, దైవం అన్నీ అమ్మే. తల్లిని మించిన దైవం లోకంలో లేదనేది వాస్తవం. పిల్లలకోసం తల్లి త్యాగం వెలకట్టలేనిది. అలాంటి తల్లికి కనీసం తిండి పెట్టని రోజులివి. కానీ పాఠశాల దశలో ఉన్న ఓ పిల్లాడు తల్లికోసం చేసిన పని చూస్తే.. హృదయం ద్రవించక మానదు. తల్లి కష్టాలు తీర్చేందుకు అతనికి ఎంతో ఇష్టమైన వాటిని కూడా వదులుకున్నాడు. అమ్మకోసం ఓ భవనం నిర్మించాడు. అమ్మకళ్లలో ఆనందం చూశాడు. చిన్న వయసులోనే తల్లి కోరిక తీర్చిన ఆ చిన్నోడు.. వదులుకున్నవి ఏంటీ.. ఎలా తల్లికి ఇల్లు కట్టించి ఇచ్చాడో.. ‘‘ది సక్సెస్ ఫుల్ గేమింగ్ సర్వర్ డెవలపింగ్ బోయ్ స్టోరీ’’ ఏంటో తెలుసుకుందాం...
ఉక్రెయిన్(Ukrainian).. ఈ దేశం పేరు విననివారు..తెలియని వారుండరు.. కొద్దినెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ కుటుంబం అక్కడినుంచి వేరేచోటికి వలస వెళ్లింది. స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటుంది. అలాంటి సందర్భంలో ఎంతో ఆత్మగౌరవంతో ఉండే ఆ తల్లి..‘‘సొంత ఇల్లు ఉండాలి’’ అని చాలా కష్టపడుతోంది. తల్లి కష్టం చూసిన ఆమె 17 ఏళ్ల కొడుకు తనకు ఇష్టమైన హాబీని వదులుకొని తల్లికి ఇల్లు కట్టుకునేందుకు సాయం చేశాడు.
మాక్సిమ్ గార్విలెంకో(Maksym Gavrylenko).. స్కాట్లాండ్‌లోని హెలెన్స్‌బర్గ్ లోమండ్ స్కూల్‌లో చదువుతున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన బాలుడు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అతని కుటుంబం వేర్వేరు చోట్ల నివసించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మాక్సిన్ తల్లి పోర్చుగల్‌లో ఓ స్నేహితురాలి ఇంట్లో ఉంటూ జాబ్ చేస్తోంది. మాక్సిన్ గ్రాండ్‌పేరెంట్స్ సొంతింటిని వదల్లేక ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు.
అయితే కొడుకుపై బెంగ పెట్టుకున్న మాక్సిన్ తల్లి ఎలాగైన కొడుకుతో కలిసి వుండాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ ఇల్లు కావాలి. గంటల తరబడి పనిచేస్తూ ఇల్లు నిర్మించుకునేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో తల్లి బాధను, కష్టాన్ని చూసిన ఆ బాలుడు.. ఓ నిర్ణయానికి వచ్చాడు. తనకు ఇష్టమైన గేమింగ్ సర్వర్‌ను అమ్మకానికి పెట్టి వచ్చిన డబ్బులతో తల్లికి ఇల్లు కట్టించాలని డిసైడ్ అయ్యాడు.
2021లో మాక్సిమ్ కుటుంబం ఉక్రెయిన్ విడిచి స్కాట్లాండ్ వెళ్లింది. స్వతహాగా టెకీ, పాఠశాలలో టీచర్ అయిన మాక్సిన్ తల్లి.. అతనికి £1,000(సుమారు రూ.1లక్ష) ఖర్చు చేసి Minecraft సర్వర్‌ని కొనుగోలు చేసి ఇచ్చింది. అయితే మాక్సిమ్ తన తెలివితేటలతో డెవలప్ చేసి గేమింగ్ కంపెనీని స్థాపించాడు. మాక్సిమ్‌కు ఇష్టమైన గేమింగ్‌లో పెద్ద పెద్ద అవకాశాలు వచ్చే విధంగా తల్లి ప్రోత్సహించింది. ఇద్దరు స్నేహితులతో కలిసి సర్వర్‌ను మాక్సిమ్ మరింత డెవలప్ చేయగా.. భారీగా ఆడేవారి సంఖ్య పెరిగింది. దీంతో సర్వర్‌కు ప్రకటనదారులు పెరిగారు. సంపాదన కూడా భారీగానే పెరిగింది. గేమింగ్ అనేది మాక్సిమ్ ఫేవరేట్ హాబీగా మారింది.
తల్లి కష్టాలు చూసిన మాక్సిమ్.. ఇల్లు కట్టుకోవాలనే తల్లి కోరికను తీర్చేందుకు గేమింగ్ సర్వర్‌ను అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో తల్లికి ఇల్లు కట్టించాడు. తల్లి కళ్లలో ఆనందాన్ని చూశాడు. అయితే మాక్సిమ్ చదువుతున్న లోమండ్ స్కూల్ మంచి అవకాశం కల్పించింది. ఒక టెక్ సంస్థ నుంచి లాభదాయకమైన ఆఫర్‌ను ఇప్పించింది. అంతేకాదు బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివేందుకు ప్రముఖ యూనివర్సిటీల్లో మాక్సిమ్‌కు అవకాశం కల్పించింది.