Vaigai Express: 46వ వసంతంలోకి వైగై ఎక్స్‌ప్రెస్
ABN , First Publish Date - 2023-08-16T08:55:08+05:30 IST
దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల
పెరంబూర్(చెన్నై): దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల అభివృద్ధికి ఆధారంగా ఉన్న వైగై ఎక్స్‌ప్రెస్ రైలు(Vaigai Express Train) 46వ జన్మదినం వేడుకలు కూడా స్వాతంత్య్ర దినోత్సవాలతో పాటు జరుపుకున్నారు. 1977 ఆగస్టు 15న ప్రారంభమైన వైగై ఎక్స్‌ప్రెస్ చెన్నై-మదురై(Chennai-Madurai) మధ్య పగటి పూట నడుస్తుండడంతో వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది. ఈ రైలు ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే మీటర్ గేజ్ రైలు మార్గంలో 105 కి.మీ వేగంతో వెళ్లిన ఆసియాలోనే తొలి రైలుగా పేరుగాంచింది. అలాగే, మీటర్ గేజ్ మార్గంలో తొలిసారిగా ఏసీ వసతితో కూడిన రైలుగా వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిచింది. మదురై నుంచి ఉదయం 7.10 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 2.35 గంటలకు చెన్నై చేరుకుంటుంది. మరోమార్గంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి రాత్రి 9.15 గంటలకు మదురై చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభించి 46వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా, రైలింజన్‌కు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అరటి తోరణాలు, రైలు పెట్టెలను రంగుల కాగితాలతో అలంకరించారు. అనంతరం రైల్వే అధికారుల సమక్షంలో ప్రయాణికులు కేక్ కట్ చేసి అందరికి పంచారు.