Train Box Hotel: మూడు స్టేషన్లలో ‘రైలు పెట్టెల హోటల్’
ABN , First Publish Date - 2023-03-24T13:02:27+05:30 IST
చెన్నై సెంట్రల్, పెరంబూర్, పొత్తేరి రైల్వేస్టేషన్‌లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది.
పెరంబూర్(చెన్నై): చెన్నై సెంట్రల్, పెరంబూర్, పొత్తేరి రైల్వేస్టేషన్‌లలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ‘రైలు పెట్టెల హోటల్(Train Box Hotel)’ ఏర్పాటుకానుంది. రైల్వేశాఖ ఆదాయం పెంచుకొనేలా ప్రైవేటు భాగస్వామ్యంతో సరుకుల రవాణా, ఖాళీ స్థలాలు ప్రైవేటుకు అద్దెకివ్వడం తదితరాలు చేపడుతోంది. అందులో భాగంగా రైల్వేస్టేషన్‌లలో రైలు పెట్టెల హాటల్ ఏర్పాటుకు దక్షిణ రైల్వే నిర్ణయించి ఈ-టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసింది. ఆ ప్రకారం, చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలోని ప్రిమీయం వాహన పార్కింగ్, పెరంబూర్ రైల్వేస్టేషన్‌లో చెన్నై సెంట్రల్(Chennai Central) వైపుకు వెళ్లే ఫ్లాట్ ఫారంపై ఈ హోటల్స్ ఏర్పాటుకానున్నాయి. ఇందుకోసం రెండేళ్ల అందజేసిన టెండర్లలో చెన్నై రైల్వేస్టేషన్‌లో ఏడాదికి రూ.95 లక్షలు, పెరంబూర్‌లో ఏడాదికి రూ.22 లక్షలు, పొత్తేరి రైల్వేస్టేషన్‌లో ఏడాదికి రూ.8.10 లక్షలకు ఖరారు చేశారు. ఈ పథకంలో ఖాళీ రైలు బోగీని రైల్వే శాఖ అందిస్తుండగా, హోటల్‌గా తీర్చిదిద్దడం, బోగీలో వంట చేసుకొనే సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.