ఈ వృద్ధురాలి ఆస్తి రూ.2 కోట్లు.. కానీ ఎవరూ లేకపోవడంతో..

ABN , First Publish Date - 2023-03-19T11:26:28+05:30 IST

మృతిచెందిన వృద్ధురాలికి వారసులెవ్వరూ లేకపోవడంతో ఆమెకు సొంతమైన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం

ఈ వృద్ధురాలి ఆస్తి రూ.2 కోట్లు.. కానీ ఎవరూ లేకపోవడంతో..

పెరంబూర్‌(చెన్నై): మృతిచెందిన వృద్ధురాలికి వారసులెవ్వరూ లేకపోవడంతో ఆమెకు సొంతమైన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఆవడి కామరాజర్‌ నగర్‌(Kamarajar Nagar) మికిళంబు వీధికి చెందిన సుందరి బాయ్‌ (54) గత ఫిబ్రవరి 17వ తేది ఇంట్లో మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆవడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సుందరి బాయ్‌ మృతికి ముందు అదే 14వ తేది ఆమె సోదరి జానకి కూడా మృతి చెందిందని, వీరివురు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని తెలిసింది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు తెలిపారు. అధికారులు అక్కడకు చేరుకొని ఇంట్లోని ఓ పెట్టెను పరిశీలించగా, 54 సవర్ల నగలు, రూ.61 లక్షల నగదు, ఇంటి పత్రాలు, బ్యాంక్‌ ఖాతా పుస్తకం ఉన్నాయి. మృతిచెందిన సుందరిబాయ్‌కి వారసులెవ్వరూ లేకపోవడంతో నగలు, నగదు, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకొని ఆవడి ట్రెజరీలో అప్పగించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని, వాటిని కాంచీపురం అరింజర్‌ అన్నా క్యాన్సర్‌ ఇనిస్ట్టిట్యూట్‌కు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Updated Date - 2023-03-19T11:26:28+05:30 IST