Viral News: మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియాల్సిందే !
ABN , First Publish Date - 2023-06-07T22:53:19+05:30 IST
ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ 13 యేళ్ల బాలిక బ్యాంకు ఖాతా నుంచి రూ.52 లక్షలు ఊడ్చేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ ‘షాకింగ్ డిస్కవరీ’తో తల్లిదండ్రులకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది.
మీ పిల్లలకు సెల్‌ఫోన్ కొనిస్తున్నారా? మీ పిల్లలు ఎప్పుడూ సెల్‌ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారా? గంటల తరబడి సెల్‌ఫోన్‌లో గేమింగ్ ఆడటం, యూట్యూబ్ ప్రొగ్రామ్‌లు చూడటం చేస్తున్నారా? అయితే మీ పిల్లలను తప్పక అనుమానించాల్సిందే.. మీ పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిస అయినట్లేనని గుర్తించాలి. వెంటనే ఈ వ్యసనం మాన్పించకపోతే ప్రమాదమే. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, టీనేజర్లు సెల్‌ఫోన్‌లో గేమింగ్, యూట్యూబ్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొగ్రామ్‌లకు బానిసలవుతున్నారని కెనడాలోని ఓ యూనివర్సిటీ సర్వేల్లో తేలింది.
అయితే..ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ 13 యేళ్ల బాలిక బ్యాంకు ఖాతా నుంచి రూ.52 లక్షలు ఊడ్చేసిన ఘటన చైనాలో(China) చోటుచేసుకుంది. ఈ ‘షాకింగ్ డిస్కవరీ’తో తల్లిదండ్రులకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఆన్‌లైన్ గేమింగ్ ఆడి..ఆ బాలిక అంత పెద్ద అమౌంట్ ఎలా పోగొట్టింది.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం..
సౌత్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావెన్సీలో సెకండరీ స్కూల్ చదువుతున్న ఓ 13 యేళ్ల విద్యార్థిని.. ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో బిజీగా ఉండటం స్కూల్ టీచర్ గమనించింది.గంటల తరబడి సెల్‌ఫోన్ చూస్తుండటంతో అనుమానం వచ్చిన ఆ టీచర్.. ఆ బాలిక ‘పే టు ప్లే’ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైనట్లు గుర్తించింది. ఇదే విషయం ఆమె తల్లిదండ్రలుకు చెప్పి హెచ్చిరించింది. దీంతో బాలిక తల్లి డెబిట్ కార్డు చెక్ చేయగా..షాకింగ్ డిస్కవరీ బయటపడింది. ఆన్‌లైన్ గేమింగ్ కోసం దఫాలుగా ఆ బాలిక దాదాపు తల్లి డెబిట్ కార్డు నుంచి నాలుగు నెలల్లో 449,500 యువాన్లు(రూ.52లక్షలు) ఊడ్చేసింది. ఖాతాలో కేవలం రూ.5 ఉన్నట్లు గుర్తించి బాలిక తల్లి షాక్ తిన్నది.
ఈ షాకింగ్ డిస్కవరీ తాలూకూ వీడియో ఒకటి ఇప్పుడు చైనాలో బాగా వైరల్ అవుతోంది. బ్యాంక్ స్టేట్‌మెంట్లు చూపిస్తూ.. బాలిక తల్లి బోరున విలపిస్తున్నట్లు ఈ వీడియో కనిపిస్తుంది. అయితే డబ్బు పోవడంపై బాలిక చెప్తున్న విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తనకు ఇష్టం లేకున్నా..ఆన్‌లైన్ గేమ్స్ కొనుగోలుకు ఒత్తిడి తెచ్చినట్లు బాలిక చెపుతోంది. ‘‘టీచర్ల సాయం తీసుకుందామంటే భయమేసింది’’ అని బాలిక చెప్పింది.
2022 కెనడా(Canada)లోని మెక్‌గిల్ యూనివర్సిటీ(McGill University) స్మార్ట్‌ఫోన్ వ్యసనం గురించి నిర్వహించిన సర్వే(Survey)లో సంచలన విషయాలు బయటపెట్టింది. చైనా(China), సౌదీ అరేబియా(Saudi Arabia), మలేషియా(Malaysia) దేశాల్లో పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్ అయ్యారని పరిశోధనలో తేలింది. అత్యధికంగా చైనాలో స్మార్ట్‌ఫోన్ వ్యసనపరులున్నారని మెక్‌గిల్ యూనివర్సిటీ నివేదిక పేర్కొంది.