Seema Haider: ఇండియా-పాకిస్తాన్ బోర్డర్‌పై ప్రశ్న.. ఓ విద్యార్థి రాసిన జవాబు చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
ABN , Publish Date - Dec 24 , 2023 | 06:20 PM
భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని, అతడిని ప్రేమించి అతడి కోసం సీమా భారత్ వచ్చేసింది.
ధోల్‌పూర్: భారత్‌కు (India) చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్ (Pakistan) మహిళ సీమా హైదర్ (Seema Haider) అప్పట్లో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ప్రేమగా మారి అతడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలతో సహా సీమా భారత్‌కు వచ్చేసింది. సచిన్‌ను పెళ్లాడిన సీమా హైదర్ కొన్ని నెలలుగా అతడితో కాపురం చేస్తోంది. అయితే సీమా పాక్ గూఢచారిణి కావొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆ కోణంలో ఇప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. అయితే కారణం వేరే అయినా సీమా హైదర్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థి (Student) పరీక్ష జవాబు పత్రంలో రాసిన ఫన్నీ ఆన్సర్ ఇందుకు కారణమైంది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ స్కూల్‌లో ఇటీవల నిర్వహించిన 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పేపర్‌లో భారత్-పాకిస్థాన్ బోర్డర్ (India-Pakistan Border) గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ``భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సరిహద్దు ఏంటి? దాని పొడవు ఎంత?`` అనే ప్రశ్న ఇచ్చారు. హిందీలో సరిహద్దును ``సీమా`` అంటారు. కాబట్టి ప్రశ్నలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సీమా (సరిహద్దు) పొడవు ఎంత అని అడిగారు (Seema Haider Height).
ఆ ప్రశ్నకు ఓ విద్యార్థి సీమా హైదర్‌ను ప్రస్తావిస్తూ జవాబు రాశాడు. ``భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సరిహద్దు పేరు సీమా హైదర్. ఆమె పొడవు 5 అడుగుల 6 అంగుళాలు. ఆమె గురించి రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి`` అని రాశాడు. ఈ జవాబు పత్రాన్ని చూసిన టీచర్ నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది.