Balayya Naga Chaitanya: బాలయ్య ‘తొక్కినేని’కి అక్కినేని మనవడి కౌంటర్.. ఈ వివాదం వెనక అసలు నిజం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-24T19:09:02+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ముగ్గురి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ త్రయమే ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు), ఎస్వీఆర్ (ఎస్వీ రంగారావు). కళామతల్లి ముద్దు బిడ్డలుగా..

Balayya Naga Chaitanya: బాలయ్య ‘తొక్కినేని’కి అక్కినేని మనవడి కౌంటర్.. ఈ వివాదం వెనక అసలు నిజం ఏంటంటే..

తెలుగు సినీ పరిశ్రమ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రముఖంగా ముగ్గురి ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ త్రయమే ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు), ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వర రావు), ఎస్వీఆర్ (ఎస్వీ రంగారావు). కళామతల్లి ముద్దు బిడ్డలుగా ఓ వెలుగువెలుగొందిన ఈ ధ్రువతారల గురించి మాట తూలే సాహసం ఏ ఒక్కరూ చేయరు. ఇండస్ట్రీకి చెందిన ఎంత పెద్ద తోపులైనా ఈ నటనా దురంధరుల గురించి మాట్లాడే సందర్భంలో సభ్యత, సంస్కారంతో వ్యవహరిస్తుంటారు. తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న వీరి గురించి ఎవరైనా అగౌరవంగా మాట్లాడితే అది ఎంత పెద్ద రచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా.. ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.

బాలయ్యకు ఆయన తండ్రి, నట శిఖరం నందమూరి తారక రామారావు అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఏ ప్రసంగం చేసినా కచ్చితంగా ‘నాన్న గారు’ అనే ప్రస్తావన రాకుండా ఆ స్పీచ్ ముగియదు. తండ్రి పట్ల ఎనలేని అభిమానం చూపించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. ఎన్టీఆర్‌తో పాటు.. ఇంకా చెప్పాలంటే తెలుగు తెరపై ఎన్టీఆర్‌తో కలిసిమెలిసి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన నటసామ్రాట్ ఏఎన్నార్‌ను ‘అక్కినేని.. తొక్కినేని’ అని కించపరిచేలా మాట్లాడటాన్ని అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరినీ గౌరవిస్తూ ‘మీరు’ అని సంబోధించే ఎన్టీఆర్ కడుపున పుట్టిన బాలకృష్ణ ఏఎన్నార్‌ను ఇంతలా తూలనాడటం ఏంటని మండిపడుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఏఎన్నార్ కుమారుడు నాగార్జున నుంచి నేరుగా స్పందన లేకపోయినప్పటికీ నాగచైతన్య ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ‘‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం..’’ అని అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించిందేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పోస్ట్ ద్వారా.. నాగార్జున కూడా బాలకృష్ణ ‘తొక్కినేని’ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పినట్టయింది. ఎన్టీఆర్‌ను మహానటుడిగా కొనియాడే బాలకృష్ణకు ఏఎన్నార్ ఎంత గొప్ప నటుడో తెలియంది కాదు. ఏదో పొరపాటున మాట్లాడారని బాలయ్య అభిమానులు సోషల్ మీడియా ద్వారా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అప్పటికే దుమారం రేగింది.

సోషల్ మీడియా ఇంత యాక్టివ్‌గా ఉన్న ఈరోజుల్లో పొరపాటున నోరుజారినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘‘బాలయ్య కావాలని అలా మాట్లాడలేదు, నాగేశ్వరరావు గారికి గౌరవం ఇచ్చే వాళ్లలో బాలయ్య ఎప్పుడూ ముందు ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. అక్కినేని, నందమూరి కుటుంబాలకి మధ్య విబేధాలు సృష్టించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని గమనించగలరు’’ అని బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కినేని తనకు బాబాయ్ లాంటి వాడని చెప్పుకునే బాలకృష్ణ ఇలా కించపరిచి మాట్లాడినందుకు అక్కినేని కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వర రావు డిమాండ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే.. అక్కినేనిని తూలనాడుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కాక రేపాయి.

FnK8fv2acAMaMc7.jfif

వాస్తవానికి నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పొరపచ్చాలు రావడం, కొన్నేళ్ల పాటు ఇద్దరూ మాట్లాడుకోకపోవడం వంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. బాహాటంగా ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. కుటుంబపరంగా కూడా ఎన్టీఆర్ ఇంటికి అక్కినేని కుటుంబం, అక్కినేని ఇంటికి ఎన్టీఆర్ కుటుంబం తరచూ వస్తూపోస్తూ ఉండేంత సన్నిహితంగా సహృద్భావ వాతావరణం ఉండేది. ఆ రెండు కుటుంబాల వారసులైన బాలకృష్ణ, నాగార్జున మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే ఉండిఉండవచ్చు గానీ బయటపడ్డ సందర్భాలు లేవు.

NTR-ANR.jpg

అక్కినేని సినిమా ఫంక్షన్లకు బాలకృష్ణ, నందమూరి హీరోల సినిమా ఫంక్షన్లకు నాగార్జున హాజరయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.. ఇలాంటి పరిణామం ఎప్పుడూ చోటుచేసుకోలేదు. అభిమానులతో బాలయ్య వ్యవహరించే తీరు మూలానో, అడపాదడపా ఆయన చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల మూలానో ఆయనపై ఒకప్పుడు నెగిటివిటీ ఉండేది. అయితే.. ఒక్క టాక్ షోతో బాలయ్య తనపై ఉన్న నెగిటివిటీని తుడిచిపెట్టేశారు. ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాల’ అనే ట్యాగ్‌లైన్‌ను నిజం చేశారు. కానీ.. తాజా వ్యాఖ్యలతో మరోసారి బాలకృష్ణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యలపై జరుగుతున్న రచ్చపై బాలయ్య స్పందిస్తారా లేక లైట్ తీస్కుంటారా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-01-24T19:12:13+05:30 IST