Snake: పాములు పగబడతాయా..? పిల్లలను మింగి మళ్లీ బయటకు రప్పించగలవా..? అసలు నిజాలేంటంటే..!

ABN , First Publish Date - 2023-08-22T10:24:04+05:30 IST

అటు దైవంగానూ, ఇటు విషపూరిత ప్రాణులుగానూ చూసే పాముల గురించి ఎన్నో నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి.

Snake: పాములు పగబడతాయా..? పిల్లలను మింగి మళ్లీ బయటకు రప్పించగలవా..? అసలు నిజాలేంటంటే..!

ఈ ప్రపంచంలో చాలామందిని భయపెట్టే జీవులు పాములు. కోరల్లో విషం ఉండటం మూలాన వీటిని ప్రమాదకర జీవులుగా పరిగణిస్తారు. కొందరికి పాముల గురించి ప్రస్తావిస్తే జుగుప్స కలుగుతుంటుంది. అటు దైవంగానూ, ఇటు విషపూరిత ప్రాణులుగానూ చూసే పాముల గురించి ఎన్నో నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. పాము పగబడితే పన్నెండేళ్ళు వదిలిపెట్టదని, అన్నేళ్ళలో మనిషి దాన్నుండి తప్పించుకోవడం అసాధ్యమని కొందరు చెబుతారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి పాములు పగ తీర్చుకోవడానికి మనిషితో పాటు మళ్లీ జన్మ ఎత్తుతాయని చెబుతారు. సినిమాలకు, సీరియళ్ళకు ఈ పాములు మంచి కథా వస్తువులుగా మారిపోతుంటాయి. ఈ మాటల్లో నిజాలెంత? పాముల గురించి నమ్మకాలు, అపోహలు తెలుసుకుంటే..

ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున దేశం యావత్తు పాములకు పాలు పోయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సినిమాలు సీరియళ్ళలో పాములకు పాలు పెట్టడం కూడా చూస్తుంటాం(snakes drinking milk). కానీ నిజానికి పాములు పాలు తాగవు. పాములు పాలను, పాల పదార్థాలను జీర్ణించుకోలేవని పరిశోధనల్లో తేలింది. వీటికి దాహం వేసినప్పుడు ఏదో ఒక ద్రవ పదార్థాన్ని తాగేస్తాయని అంటున్నారు. ఆ కోవలోనే పాలను కూడా తాగేస్తాయని ఆ తరువాత ఇవి జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని బట్టి పాములు పాలు తాగుతాయనే మాట అవాస్తవం.

జంట పాముల గురించి కూడా చాలా అపోహలున్నాయి ప్రజల్లో. ఎక్కడైనా జంట పాములుంటే వాటి కంట పడితే ఇక చావు మూడినట్టే అని నమ్ముతుంటారు. కానీ ఇది కూడా వాస్తవం కాదు. జంట పాములు ఏకాంతంగా ఉన్నప్పుడు అలికిడి వింటే అక్కడినుండి వెళ్ళిపోతాయి. కాకపోతే పాములు అయినా మనుషులు అయినా జంతువులు అయినా సంభోగంలో ఉన్నప్పుడు ఆటంకం కలిగించడం తప్పు. ఇకపోతే పాములు ఇతర జంతువుల్లా, మనుషుల్లా జంటగా ఉండవు. అవి తమ భాగస్వాములతో కలిసి జీవించవు. ఒకవేళ పాములు ఇలా కలిసి జీవించే పక్షంలో పెద్ద పాములు చిన్నపాములను చంపి తినే అవకాశం ఉంటుందట.

Snake Cave: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం పాము ఆకారంలో గుహ.. అచ్చం చర్మాన్ని పోలి ఉండేలా..!



పాము విషం అంతా వాటి కోరల్లో ఉంటుంది. పామును చంపాలంటే చాలామందిి మొదట పడగ మీద లేదా తలమీద కొడుతుంటారు. మరికొందరు పాము తలను మొండెం నుండి వేరు చేస్తుంటారు. ఇలా పాము తలను మొండెం నుండి వేరు చేసిన తరువాత సూర్యాస్తమం వరకు దాని మొండెంలో ప్రాణం ఉంటుందని

నమ్ముతుంటారు. కానీ ఇది కేవలం అపోహ అని తెలిసింది. పాము తలను మొండెం నుండి వేరు చేసిన తరువాత దాని మొండెంలో కొంతసేపటివరకు కదలిక ఉంటుంది అంతే.

ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు పాము తన పిల్లలను మింగి ఆ తరువాత మళ్ళీ బయటకు వదులుతుందని కొందరు నమ్ముతారు. కానీ పాము ఏదైనా మింగితే వాటి కడుపులోని జీర్ణరసాల కారణంగా మింగిన జీవులు చనిపోతాయి, తరువాత జీర్ణమైపోతాయి. కాబట్టి అవి వాటి పిల్లలను మింగడం, తిరిగి వాటిని బయటకు వదలడం అంతా అపోహే

పాము పగ(snake revenge) గురించి బోలెడు సినిమాలు, సీరియళ్ళు వచ్చాయి. ప్రజలు కూడా పాము పగ నిజమని నమ్ముతారు. ముఖ్యంగా నాగుపాము దైవ సమానంగా పూజించబడుతుంది కాబట్టి వీటిని చంపితే అవి మళ్లీ జన్మించి మనిషిని చంపేవరకు వదలవని అంటుంటారు. కానీ దాడి చేసిన వ్యక్తిని అవి అసలు గుర్తించలేవని, వాటి జ్ఞాపకశక్తి అంత పదునైనది కాదని పరిశోధనలు చెబుతున్నాయి. పాము పగ గురించి ఉన్న గందరగోళం అంతా సినిమాలు, సీరియళ్ళు, కథల ద్వారానే వ్యాపించిందని అంటున్నారు.

పాము చెవులు అనే మాట తరచుగా వింటూ ఉంటాం. పాములు చిన్న చిన్న శబ్దాలను కూడా చాలా స్పష్టంగా వింటాయని అంటుంటారు. నిజానికి పాములకు చెవులు ఉండవు. ఇవి నేలమీద పాకుతున్నప్పుడు వీటి చర్మస్పర్శ ద్వారా ఇవి కంపనాలను పసిగట్టగలుగుతాయి అంతే.

Smartphone Charging: స్మార్ట్‌ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్ మార్చితే చాలు.. యమా స్పీడ్‌గా ఛార్జింగ్..!


Updated Date - 2023-08-22T10:24:04+05:30 IST