Viral Video: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిస్తే ఇలాగే ఉంటుంది మరి!

ABN , First Publish Date - 2023-05-26T16:44:58+05:30 IST

దక్షిణ కొరియా డేగు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ డోర్తె రిచినందుకు ఓ వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు.

Viral Video: విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిస్తే ఇలాగే ఉంటుంది మరి!

ఇంటర్నెట్ డెస్క్: విమానం ల్యాండింగ్ అయ్యే సమయం. దాదాపు 700 అడుగుల ఎత్తులో ఉంది. మరో రెండు మూడు నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది అనగా.. ఇంతలో అనూహ్య సంఘటన.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడంతో అందరూ షాక్ అయ్యారు. గాలి ఒక్కసారిగా విమానంలోకి ప్రవేశించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొందరు కిందపడి పోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు విమానం ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ ప్రయాణికుడు అనాలోచితంగా చేసిన నిర్వాకం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుంది. అదృష్టం బాగుండి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విమానంలో ప్రయాణించే ఓ ప్యాసింజర్ ఘటనకు సంబంధించి పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దక్షిణ కొరియా(South Korea) డేగు విమానాశ్రయంలో(Daegu International Airport) విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ డోర్(Emergency Door) తెరిచినందుకు ఓ వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం(Asiana Airlines flight) డేగు విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడంతో డజనుకు పైగా ప్రయాణికులు గాయపడ్డారు. శ్వాస సమస్యలతో బాధపడ్డారు, వారిలో తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలిపాయి.

ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్న ఓ ప్రయాణికుడు విమానం భూమి నుండి 700 అడుగుల ఎత్తులో ఉండగా, ల్యాండింగ్‌కు రెండు నిమిషాల ముందు డోర్ తెరిచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నిర్వాకానికి పాల్పడిన 30 ఏళ్ల వ్యక్తిని ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు.

ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ OZ8124 విమానం జెజు ద్వీపం నుంచి డేగు వెళ్తోంది. అందులో 194 మంది ప్రయాణికులతో సహా మొత్తం 200 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఏషియానా ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-26T17:21:09+05:30 IST